సాక్షి, శ్రీకాకుళం: అభివృద్ధి ఎలా చేస్తామో విస్పష్టంగా చెప్పే నిబద్ధత కలిగిన నాయకులు కావాలో... లేదంటే నిత్యం అబద్ధాలతో, మోసాలతో కప్పిపుచ్చిన టీడీపీ ప్రభుత్వం కావాలో పౌరులే ఆలోచించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అభిప్రాయం! ఐదేళ్ల పాలనలో జిల్లాకు ఏమీ చేయలేక చేతులెత్తేసిన టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇప్పుడు మరోసారి పౌరుల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు లేదంటారు ఆయన! ఈ ఎన్నికలలో తనకు ప్రజలు అవకాశం ఇస్తే శ్రీకాకుళంలో మళ్లీ అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు! సోమవారం ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే...
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేర్కొన్నారు. రానున్న కాలంలో వచ్చే ప్రభుత్వాలు ఎక్కువగా నిధులు ఇవ్వాలని, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని దాని ఉద్దేశం. తాజా గణాంకాల ప్రకారం అత్యంత తక్కువ తక్కువ తలసరి ఆదాయం కలిగిన జిల్లా కూడా శ్రీకాకుళమే. జీడీపీలో భాగస్వామ్యం తక్కువే. శ్రీకృష్ణ కమిషన్ కూడా అదే చెప్పింది. రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించేందుకు శివరామకృష్ణన్ కమిటీ చేసిన అధ్యయనంలో అదే తేలింది.
శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా అనడానికి ఇన్ని రుజువులున్నా ఈ ప్రాంతం అభివృద్ధికి ముఖ్య మంత్రిగా చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ఏమీ లేవు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 12 జాతీయ స్థాయి సంస్థలు, అదనంగా మరో 14 సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. 13 జిల్లాలున్న ఈ రాష్ట్రంలో వాటా ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రెండు సంస్థలు రావాల్సి ఉంది. రెండు కాదు ఒకటి కాదు వచ్చింది జీరో! ఏ ఒక్క సంస్థనూ ఈ జిల్లాలో ఏర్పాటు చేయలేదు. ఇది చంద్రబాబు సర్కారు పక్షపాత వైఖరి, నిర్లక్ష్యం మాత్రమే కాదు స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల ఘోర వైఫల్యం కూడా.
చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదు...
ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు ఈ జిల్లాకు వచ్చినప్పుడల్లా తనకే ఓటు అడిగే హక్కు ఉందని చెబుతున్నారు. రాష్ట్రానికి రూ.2.25 కోట్ల లక్షల అప్పు చేసిన టీడీపీ ప్రభుత్వం ఈ జిల్లాలో ఆస్తుల నిర్మాణానికి పెట్టుబడి పెట్టనేలేదు. ఈ ఐదేళ్లూ జిల్లా ప్రజలు చెల్లించిన పన్నుల్లో వాటా కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల్లో వాటా కానీ అడగట్లేదు నేను. రాష్ట్రం చేసిన అప్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు న్యాయంగా దక్కాల్సిన వాటా కూడా దక్కలేదనే ఆవేదన ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఒకసారి, టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరోసారి జిల్లాకు తీవ్ర నష్టం జరిగిన విషయాన్ని జిల్లా పౌరులు గమనించాలి.
దాదాపు 70 ఏళ్ల పాటు వివిధ జాతీయ స్థాయి సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుతో, ప్రజల పెట్టుబడులతో అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను విభజనతో తెలంగాణకు వదిలేయాల్సి వచ్చింది. ఆ నష్ట నివారణలో భాగంగా కేంద్రం మంజూరుచేసిన జాతీయ స్థాయి సంస్థల్లో ఏ ఒక్కటీ జిల్లాలో ఏర్పాటు చేయలేదు. అవన్నీ ఒక్కసారి మాత్రమే వస్తాయి. చంద్రబాబు సర్కారు వల్ల జిల్లాకు పూడ్చలేనంత నష్టం వాటిల్లింది. వాటిలో ఏ ఒక్కటైనా ఇక్కడ ఏర్పాటు చేసేలా అతనికి నచ్చజెప్పలేని అసమర్థులుగా ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు మిగిలిపోయారు. అందుకే చంద్రబాబుకు కానీ, టీడీపీ నాయకులకు కానీ జిల్లా ప్రజలను ఓటు అడిగే హక్కులేదు.
ఏ గట్టున ఉంటారో ఆలోచించాలి
జిల్లాకు నిధుల్లో న్యాయమైన వాటా ఇవ్వకుండా ఐదేళ్లూ అన్యాయం చేసిన మోసకారి టీడీపీ ప్రభుత్వం, నాయకత్వం ఒకవైపున, మరోవైపు జిల్లా అభివృద్ధికి అనేక విధాలుగా చర్యలు తీసుకున్న వైఎస్సార్ కుమారుడిగా ఆ పంథానే తాను కూడా కొనసాగిస్తానని చెబుతున్న జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. ఏ గట్టున ఉండాలో జిల్లా పౌరులు ఆలోచించాలి.
యువతకు ఉపాధి అవకాశాలొస్తాయి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ అనే వాదనకు కట్టుబడి ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ద్వారానే దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి పెట్టుబడులు వస్తాయి. ఇలా శ్రీకాకుళం జిల్లాకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది కూడా. పరిశ్రమలు వస్తాయి. వాటిలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతా యి. అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిం చడానికి ముందుకొచ్చే జాతీయ పార్టీ ఏదైనా సరే కేంద్రంలో వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుందని మా పార్టీ అధ్యక్షుడు జగన్ విస్పష్టంగా చెప్పారు.
వైఎస్సార్ హయాంలో పెద్దపీట
వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చెం దిన జిల్లాల సరసన నిలపడానికి ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్సార్ పెద్దపీట వేసేవారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లోనున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వంశధార రెండో దశ, తోటపల్లి, మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, మడ్డువలస విస్తరణ తదితర పనులన్నీ మంజూరు చేశారు. శ్రీకాకుళంలో మెడికల్ కాలేజీ (రిమ్స్), యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. మంత్రిగా నాకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ శ్రీకాకుళం జిల్లాకు నిధుల్లో మెరుగైన వాటా తీసుకురావడానికి కృషి చేశాను.
అనేక రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేయించాను. శ్రీకాకుళం నగరానికి రెండు భారీ వంతెనలతో పాటు జిల్లాలో తొమ్మిది బ్రిడ్జిలు, ఆర్వోబీలు అందుబాటులోకి తెచ్చాను. శ్రీ కాకుళంలో కలెక్టరేట్ కొత్త భవన సముదాయం నిర్మాణానికి మంజూరు చేయించాను. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఆ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఏసీ ఆడిటోరియం, టీటీడీ కల్యాణ మండపం నా హయాంలో మంజూరు చేయించినా టీడీపీ ప్రభుత్వం పక్కనబెట్టింది. రింగ్‌రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా హామీలిస్తూనే వచ్చారు తప్ప ఆచరణలోకి తేలేదు. ఆయన మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన కేఆర్ స్టేడియం నిర్మాణం ఇంకా పునాది దశలోనే ఉంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వంశధార పూర్తి...
అనేక సంక్షేమ పథకాలకు, సాగునీటి ప్రాజెక్టులకు నాంది పలికి రైతు బాంధవుడైన డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార ప్రాజెక్టు పూర్తిగా ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం. తద్వారా మండువేసవి మే 15వ తేదీన చూసినా జిల్లాలోని గ్రామాల్లో చల్లని వంశధార నీరు గలగలా పారే అవకాశం ఉంటుంది. ఆ సుందర దృశ్యం చూడాలనేదే నా జీవిత ఆశయం, లక్ష్యం కూడా. అందుకే ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళంలో బహిరంగ సభ జరిగినప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే హామీ ఇచ్చారు.
మత్స్యకారులకు తీరని అన్యాయం
జిల్లాలో మత్స్యకారులకు టీడీపీ ప్రభుత్వంతో తీరని అన్యాయం జరిగింది. వారిలో చాలామంది ఆర్నెల్ల కాలానికి ఇక్కడి నుంచి గుజరాత్, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతుంటారు. తమ కుటుంబాలకు దూరంగా, చావుబతుకుల మధ్య తమ వృత్తిని కొనసాగిస్తున్నవారు కొన్ని వేల మంది ఉన్నారు. కనీసం వారి కోసం జిల్లా తీరంలో ఫిషింగ్ జెట్టీలు, కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలి. రాయితీలపై బోట్లు, వలలు ఇచ్చి సంప్రదాయ మత్స్యకారులను ప్రోత్సహించాలి. కానీ టీడీపీ ప్రభుత్వం అలాంటి సంక్షేమ చర్యలను విస్మరించింది. మత్స్యకారులకు మేలు చేయడానికి వైఎస్సార్‌సీపీ సంకల్పించింది.
జిల్లా అభివృద్ధికి ఓ విజన్ ఉంది...
శ్రీకాకుళం జిల్లాను ఎప్పటికైనా రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాల సరసన నిలపకపోతే అన్నివిధాలా నష్టపోయే, ఇతరుల దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ జిల్లా అభివృద్ధికి ఏం చేయాలో, అందుకు ప్రభుత్వాలకు, సంస్థలకు ఏం చెప్పాలో నాకో విజన్ ఉంది. జిల్లాలో ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో శాంతిపూర్వక చర్చల ద్వారా సమస్యను పరిస్కరించుకొని నేరడి బ్యారేజీ నిర్మాణానికి, తద్వారా వంశధార రెండో దశ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. రిజర్వాయర్, వంశధార కుడి, ఎడమ కాలువల లైనింగ్ పూర్తి చేస్తే జిల్లాలో రెండో పంటకే కాదు 2.55 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంటలకు అవసరమైన సాగునీరు అందుతుంది. తద్వారా జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు ఇప్పుడున్న దానికన్నా నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment