విధి నిర్వహణలో తేడాలొస్తే..సహించం | Sakshi special interview with District SP GVJ Asok Kumar | Sakshi

విధి నిర్వహణలో తేడాలొస్తే..సహించం

Published Sun, Jul 29 2018 12:09 PM | Last Updated on Sun, Jul 29 2018 12:09 PM

Sakshi special interview with District SP GVJ Asok Kumar

సాక్షి ప్రతినిధి, అనంతపురం : వరుస రైల్వే చోరీలు.. క్షేత్ర స్థాయిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కొందరు సీఐలు.. ఈ పరిణామాల మధ్య కొత్త ఎస్‌ఐలకు పోలీసు శాఖ ఎలాంటి దిశానిర్దేశం చేస్తోంది. రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలిగారా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? పోలీసుశాఖ వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి? తదితర అంశాలపై జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌తో ‘సాక్షి’ ముఖాముఖి.

సాక్షి: రైల్వే దొంగతనాలు తీవ్ర చర్చనీయాంశంగా ఉన్నాయి? అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 
అశోక్‌: నెలరోజుల్లో ఏడు దొంగతనాలు జరగడాన్ని తీవ్రంగా పరిగణించాం. కేసులను సీరియస్‌గా తీసుకున్నాం. షోలాపూర్‌కు ప్రత్యేక బృందాలను పంపాం. దొంగతనాల నివారణకు ఇక్కడ సిగ్నల్‌ ఫోర్స్‌తో పాటు పెట్రోలింగ్‌ పెంచాం. కర్నూలు, అనంతపురం, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా శ్రమిస్తున్నాం. ప్రస్తుతానికి చోరీలు ఆగాయి.

సాక్షి: షోలాపూర్‌ గ్యాంగే దొంగతనాలు చేసిందని ఎలా నిర్ధారణకు వచ్చారు?
అశోక్‌: 2016లో గార్లదిన్నె, తాటిచెర్లలో ఇక్కడ దొంగతనాలు జరిగాయి. అప్పుడు ఓ ముఠా పట్టుబడింది. వారు షోలాపూర్‌ గ్యాంగ్‌. అందులో కొందరు పట్టుబడ్డారు. ఇంకొందరు తప్పించుకున్నారు. ఆ ఘటన ఆధారంగా గుర్తించాం. వారు పార్థిగ్యాంగ్‌ అనే భావిస్తున్నాం. వీరు అన్ని రకాల దొంగతనాలు చేస్తారు. రైళ్లలో పోలీసులు లేకపోతే ఎక్కువగా చైన్‌స్నాచింగ్‌ చేస్తారు. బ్యాగులు, పర్సులు కొట్టేస్తారు. రైలును ఆపిన తర్వాత తక్కువ టైంలోనే దిగిపోతున్నారు. చోరీలతో పాటు ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీన్ని సీరియస్‌గానే తీసుకున్నాం.

సాక్షి: కొంతమంది సీఐలు అధికారపార్టీకి పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి? దీనివల్ల సామాన్యులు, ప్రతిపక్షపార్టీల సానుభూతి పరులు ఇబ్బంది పడుతున్నారు? 
అశోక్‌: పెద్ద ఎత్తున ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అంశాలు నా దృష్టికి రాలేదు. వచ్చిన అంశాలను ఎప్పటికప్పుడు గుర్తించి వారితో మాట్లాడి సరి చేస్తున్నాం. అలాంటి ఘటనలుంటే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిస్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.

సాక్షి: కొందరు సీఐలు, సీనియర్‌ ఎస్‌ఐలు ఇలా వ్యవహరించే తీరు.. కొత్తగా విధుల్లోకి వచ్చిన ఎస్‌ఐలపై ప్రభావం చూపే అవకాశం ఉండదంటారా? 
అశోక్‌: క్రైం మీటింగ్‌ల్లో డీఎస్పీలు, సీఐలతో మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఎస్‌ఐలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపిస్తున్నాం. ఇప్పటికే రెండు బ్యాచ్‌లను పిలిపించి మాట్లాడాం. పోలీసులు ఎలా పనిచేయాలి? ప్రజలతో ఎలా నడుచుకోవాలి? మహిళలపై జరిగే దాడులు, రోడ్డు ప్రమాదాలు, టెక్నాలజీ వాడుకోవడంపై మాట్లాడుతున్నా. నాతో పాటు సీనియర్‌ ప్రొఫెసర్లు, జువైనల్‌ యాక్టు, సాంకేతిక నిపుణులను పిలిపించి విభాగాల వారీగా అవగాహన కల్పిస్తున్నాం.

సాక్షి: ఎన్నికలు రాబోతున్నాయి? సమస్యాత్మక గ్రామాలు గుర్తించారా?
అశోక్‌: సమస్మాత్మక, అతి సమస్యాత్మక, ఫ్యాక్షన్‌ గ్రామాలను గుర్తించాం. రెండు గ్రూపులతో మాట్లాడి, గొడవలు తగ్గుముఖం పట్టే చర్యలకు ఉపక్రమిస్తున్నాం. వారి డేటా కూడా స్టేషన్లలో ఉండేలా చూస్తున్నాం.

సాక్షి: గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 
అశోక్‌: నిజమే. గతంతో పోలిస్తే ఈ ఏడాది తగ్గాయి. రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నాం. హైవేలు, పట్టణ ప్రాంతాలతో పాటు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేందుకు కటౌట్లు, ఇండికేటర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. హెల్మెట్‌ వాడకం కూడా పెరిగింది. 60–70శాతం మంది వాడుతున్నారు. ఇది మంచి పరిణామం. దీన్ని వందశాతానికి తీసుకెళ్లాలి. తనిఖీలు తగ్గించి అవగాహన కార్యక్రమాలు పెంచాలనుకుంటున్నాం.

సాక్షి: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఎలా సాగుతున్నాయి? 
అశోక్‌: రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఎంతో ఉపయోగకరం. రెగ్యులర్‌గా వీటిని కొనసాగిస్తున్నాం. అయితే సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ల కొరత ఉంది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే కచ్చితంగా కోర్టుకు హాజరుపర్చాల్సి ఉంది. దీంతో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెజిస్ట్రేట్‌లు పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాత డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేసే బృందాలను పెంచుతాం.

సాక్షి: పోలీసుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
అశోక్‌: పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పోలీసు సంఘాల ప్రతినిధులు రెగ్యులర్‌గా మాతో మాట్లాడుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా.. పోలీసు సిబ్బందికి అండగా ఉంటున్నాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement