వినూత్నం.. విభిన్నం
వినూత్నం.. విభిన్నం
Published Tue, May 16 2017 11:18 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
అర్బన్ జిల్లాలో నేరాల అదుపునకు ఎస్పీ రాజకుమారి చర్యలు
షీటీమ్, కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ ఏర్పాటు
బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా ఎస్పీతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో నేరాల అదుపునకు మహిళా ఎస్పీ బి.రాజకుమారి పటిష్ట ప్రణాళికతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈవ్ టీజింగ్ నిరోధకానికి షీటీమ్, నేరాల అదుపునకు ప్రజల సహకారం కోసం విజిబుల్ పోలీసింగ్, అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడానికి ఇప్పటికే ఉన్న ఏజీఎస్ పార్టీని బలోపేతం చేశారు. పేకాట, హైటెక్ వ్యభిచారం, క్రికెట్ బెట్టింట్ వంటి అసాంఘిక కార్యకాలాపాలు నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఉన్న అస్థవ్యస్థ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దిశగా నగరపాలక సంస్థ సహకారంతో అడుగులు చేస్తున్నారు. బి.రాజకుమారి అర్బన్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టి మంగళవారంతో ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో అర్బన్ జిల్లాలో నేరాల అదుపు, మహిళా రక్షణ తదితర అంశాలపై ఎస్పీతో ‘సాక్షి’ మాట్లాడారు. ఆమె మాటల్లోనే...
మహిళా వేధింపులపై ప్రత్యేక చర్యలు
+ నగరంలో విద్యా సంస్థలు అధికంగా ఉన్నాయి. విద్యా సంస్థలు, బస్‌స్టాప్‌లు ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో మహిళలను కొంత మంది వేధిస్తున్నారు. నేను బాధ్యతలు చేపట్టిన కొత్తలో కొంత మంది నాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అప్పడే హైదరాబాద్‌లోలాగా ఇక్కడ కూడా షీటీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే షీటీమ్ ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు షీటీమ్ 1600 మందికి కౌన్సెలింగ్ ఇచ్చింది. యువకులు, వారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడింది. బాధితుల ఫిర్యాదు మేరకు తీరు మారని వారిపై 30 కేసులు పెట్టింది.
+ అర్బన్ ఏరియాలో పేకాట, కోడిపందేలు, హైటెక్ వ్యభిచారం ఎక్కువగా జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. సీజన్ వారీగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. గంజాయి రవాణా ఉంది. వీటిని అదుపు చేయడానికి ఇప్పటికే ఉన్న యాంటీ గూండా స్క్వాడ్‌ను యాక్టివ్ చేశాం. ప్రత్యేకంగా ఎస్సై, సిబ్బందిని నియమించి దాడులు చేయించాం. మద్యం దుకాణాల వద్ద న్యూసెన్స్, సమయం దాటి అమ్మకాలను పూర్తిగా నియంత్రించాం. అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నాం.
కమ్యూనిటీ పోలీస్ ఆఫీషర్స్(సీపీవో) ఏర్పాటు ఉద్దేశం...?
+ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసుల సంఖ్య పెరగడం లేదు. నేరాల అదుపు, సమాచారం అందివ్వడం కోసం పోలీసుల స్థానికులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో చురుకైన, ఆసక్తి ఉన్న యువకులను కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్‌గా నియమిస్తాం. ఇప్పటికే దీనికి రూపకల్పన చేశాం. మరో రెండు మూడు రోజుల్లో సీపీవోను ప్రారంభిస్తాం.
+ నగరంలో రౌడీయిజాన్ని సహించేది లేదు. 252 మందిపై రౌడీషీట్స్ ఉన్నాయి. వాటినన్నింటినీ డిజిటలైజేషన్ చేశాం. వీరిలో 181 మంది నగరంలో ఉన్నారు. మిగిలిన వారు బయటకు వెళ్లడం, మళ్లీ రావడం చేస్తున్నారు. అందరి కదలికలపై నిఘా పెట్టాం. తరచూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. నలుగురిపై పీడీ కేసులు పెడుతున్నాం. రౌడీ షీటర్లు తీరు మార్చుకోకపోతే నగర బహిష్కరణకు సిఫార్సు చేస్తాం.
+ నగరంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. జంక‌్షన్ల వద్ద సిగ్నల్స్ పూర్తి స్థాయిలో లేవు. ఉన్న వాటిలో కొన్ని సరిగా పనిచేయడం లేదు. సిగ్నల్స్ పెట్టాలని నగరపాలక సంస్థకు లేఖ రాశాం. నగరంలోని కూడళ్లు, రద్దీ ప్రదేశాలను గుర్తించి, అవసరమైన చోట నగరపాలక సంస్థ ద్వారా డివైడర్లు ఏర్పాటు చేయించాం. సీసీ కెమెరాలు ఏర్పాటుకు నగరపాలక సంస్థతో కలసి పనిచేస్తున్నాం.
+ స్టేషన్ల వద్ద చట్ట విరుద్ధంగా సెటిల్‌మెంట్లు చేస్తుంటే బాధితులు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం. కొంత మంది భూతగాదాలలో మమ్మల్ని చంపుతామని బెదిరించారని ఫిర్యాదు చేస్తున్నారు. బెదరించడం క్రిమినల్ కేసు అవుతుంది. అంత వరకే మా బాధ్యత. డాక్యుమెంట్లు ఉండి వేరు వారు ఆస్తిని ఆక్రమిస్తే అది పూర్తిగా క్రిమినల్ కేసు అవుతుంది. మా విభాగం సిబ్బంది ఇబ్బందులు పెడితే బాధితులు నన్ను సంప్రదించాలి. ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ మధ్యన పరివర్తన పేరుతో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాం అని రాజకుమారి వివరించారు.
Advertisement