ఆయన అవినీతి పరులకు సింహస్వప్నం | Sakshi Special Interview With PSR Nellore District ACB DSP CH Devanand Santho | Sakshi
Sakshi News home page

ఆయన అవినీతి పరులకు సింహస్వప్నం

Published Fri, Jan 10 2020 7:52 AM | Last Updated on Fri, Jan 10 2020 7:52 AM

Sakshi Special Interview With PSR Nellore District ACB DSP CH Devanand Santho - Sakshi

ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ దేవానంద్‌ శాంతో

అవినీతి పరులకు ఆయన సింహస్వప్నం. సాధారణంగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అంటే చెప్పనవసరం లేదు. కానీ తన ముప్పై ఏళ్ల పోలీస్‌శాఖ ఉద్యోగ జీవితంలో ఏ మరక అంటని అధికారి ఆయన. దాదాపు పదిహేడు ఏళ్ల క్రితం తొలిసారిగా అందుకున్న రాష్ట్ర ఉత్తమ సేవా పతకం.. ఇప్పుడు రెండో సారి అందుకుంటున్నారు. గంజాయి వనంలో తులసీ మొక్కలా ఇలాంటి అధికారులు అక్కడక్కడ ఉంటారు. అటువంటి వారే అవినీతి నిరోధక శాఖలో కలికి తురాయిల్లా గుర్తింపు పొందుతుంటారు. వీరిలో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ దేవానంద్‌ శాంతో ఒకరు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ సేవా పతకానికి ఎంపికైన ఆయన తన పనితీరుకు కొలమానమే ఈ ఉత్తమ సేవా పతకమంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. – సాక్షి, నెల్లూరు 

ఒడిశాకు చెందిన మా కుటుంబం విజయనగరానికి వలస వచ్చింది. మా నాన్న పేరు సదానంద శాంత్రో, అమ్మ పేరు చంద్రప్రభదేవి. మాది జమీందార్‌ వారసత్వ కుటుంబం. మా నాన్న స్థానిక రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉండేవారు. నాకు సుస్మితతో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా పెద్దబ్బాయి సుదేష్‌ శాంతో యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. రెండో అబ్బాయి సిద్ధార్ధ శాంత్రో బీటెక్‌ పూర్తిచేసి గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు.

చదువు.. ఉద్యోగం
నా బాల్యం అంతా విజయనగరంలోనే గడిచింది. స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీలో ఎకానివిుక్స్‌ సబ్జెక్ట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేశాను. 1985లో చదువు పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ ప్రారంభించాను. 1986లో ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్‌ అధికారిగా ఎంపికయి రెండేళ్ల పాటు ఉద్యోగం బాధ్యతలు నిర్వహించాను. 1989లో జరిగిన పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఎస్సైగా సెలక్ట్‌ అయ్యాను. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన చింతపల్లి, పాడేరుల్లో విధులు నిర్వహించాను. 2000లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్‌ పొంది ఏసీబీలో  ఐదేళ్లు పని చేశాను. విజయవాడలో పనిచేసే సమయంలో 2003లో ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యాను. ఆపై 2007లో  డీఎస్పీగా పదోన్నతి పొంది పాలకొండ సబ్‌డివిజన్, విజయవాడలో లా అండ్‌ ఆర్డర్‌ డీఎస్పీగా పనిచేశాను. నాలుగున్నర ఏళ్లగా మళ్లీ ఏసీబీ విభాగంలోకి వచ్చి డీఎస్పీగా పనిచేస్తున్నాను. గుంటూరులో మూడేళ్లు చేసి నెల్లూరుకు వచ్చాను.

అవినీతి పరులపై కొరడా
నెల్లూరుకు వచ్చి పదహారు నెలలు అయింది. ఈ కాలంలో దాదాపు 50 వరకు అవినీతి కేసులు నమోదు చేశాను. ఇటీవల తెలుగుగంగలో పనిచేస్తున్న ఆర్డీఓ స్థాయి అధికారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశాం. పేదలను పీడించే ఉద్యోగులకు, అధికారులకు ఏసీబీ ఉందన్న భయం కలిగించేలా చేస్తున్నాం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేస్తున్నట్లు మాకు ఫిర్యాదు వస్తే వదిలి పెట్టం. ప్రభుత్వం నుంచి నెల వారీగా జీతాలు తీసుకుంటూ పనిచేసే ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన వారు లంచం తీసుకోవడం నేరం.
 
అవినీతిలో రెవెన్యూ టాప్‌ 
ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం ప్రవేశ పెట్టిన 14400 కాల్‌ సెంటర్‌కు చేసే ఫిర్యాదుల్లో అధిక భాగం రెవెన్యూ పైనే ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 158 ఫిర్యాదులు వస్తే అందులో 120పైగా రెవెన్యూ శాఖవే ఉన్నాయి. రెండో ప్లేస్‌ పోలీస్‌ శాఖపై వస్తున్నాయి. ఇంజినీరింగ్, వైద్యశాఖల పైనా ఫిర్యాదులు వచ్చాయి. కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేసిన వారికి న్యాయం జరిగేలా చేస్తున్నాం. బాధితులు మా పని జరిగితే చాలనుకున్న వారికి పని జరిగేలా చేస్తున్నాం. ఒక వేళ లంచం డిమాండ్‌ చేస్తున్నాడని చెబితే మాత్రం రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుంటున్నాం.

ఇటీవల కాల్‌ సెంటర్‌ నుంచి వచ్చిన ఫిర్యాదులు మేరకు నెల్లూరులోని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ఓ చిన్న కాంట్రాక్టర్‌కు బిల్లు చేయాలంటే ఆ బిల్లులో రెండు శాతం లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో అతనిపై కేసు నమోదు చేశాం. అల్లూరు మండలం తూర్పుగోగులపల్లె వీఆర్వో ఓ పేద రైతు భూమిని ఆన్‌లైన్‌ అడంగళ్‌లో నమోదుకు నెలల కాలంగా తిప్పుకుంటూ పనిచేయకుండా లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఆ రైతు వీఆర్వోకు æలంచం ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేశాం. ఏసీబీ పెట్టిన కేసులు 80 శాతం వరకు శిక్షలు కూడా పడుతున్నాయి. 

నా పని తీరుకు కొలమానమే 
నా సర్వీసులో ఇప్పటికి రెండు సార్లు ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యాను. రెండు సార్లు ఏసీబీలో పని చేసేటప్పుడు ఎంపిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా కేరీర్‌లో అవినీతి మచ్చలేకుండా విధి నిర్వహణ చేశాను. సేవా పతకం ఎంపిక కావాలన్నా సర్వీసులో పనితీరును పరిశీలించి ఎంపిక చేస్తారు. ఎలాంటి మచ్చ ఉన్నా ఈ పతకానికి ఎంపిక చేయరు. నా సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకానికి ఎంపిక చేసింది. ఈ పతకాలు నా పని తీరుకు కొలమానంగా భావిస్తున్నాను.  

ఉగాది రోజున ఉత్తమ పురస్కారం
ఉగాది పండగను పురస్కరించుకుని పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ఏపీ ముఖ్యమంత్రి శౌర్య పతాకం, ఏపీ పోలీసు/ఫైర్‌ సర్వీసెస్‌ మహోన్నత సేవా పతాకం, ఏపీ పోలీసు/ఫైర్‌ సర్వీసెస్‌ ఉత్తమ సేవా పతాకం, ఏపీ పోలీసు కఠిన సేవా పతాకం, ఏపీ పోలీసు/ఫైర్‌ సర్వీసెస్‌ సేవా పతాకాలు అందించనుంది. అందుకు సంబంధించిన జాబితాను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జాబితాను విడుదల చేసింది. ఇందులో జిల్లాకు చెందిన పలువురుకు పతకాలు వరించాయి. వారందరికి ఉగాది రోజు పతాకాలను బహూకరించనున్నారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ దేవానంద్‌శాంతో ఏపీ స్టేట్‌ పోలీసు ఉత్తమ సేవాపతకం అందుకోనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement