విద్యుత్ టవర్ ఎక్కిన సమైక్యవాది
Published Wed, Oct 2 2013 3:03 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
కాణిపాకం, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ ఐరాల మండలానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఐరాల మండలం పాతపాళెం గ్రామానికి చెందిన ప్రకాష్ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గ్రామ సమీపంలోని 133 కేవీ విద్యుత్ హైటెన్షన్ టవర్ పైకి ఎక్కి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. టవర్‌పై నుంచి ‘జై సమైక్యాంధ్ర.. జైజై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశాడు. కిందకు దిగాలని స్థానికులు బతిమిలాడినా వినిపించు కోలేదు. సమాచారం అందన వెంటనే ఐరాల ఎస్‌ఐ వాసంతి అక్కడకుచేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
మూడు గంటల పాటు అతను కిందకు దిగకపోవడంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిత్తూరు సీఐ శ్రీకాంత్, కాణిపాకం ఎస్‌ఐ లక్ష్మీకాంత్, గుడిపాల ఎస్‌ఐ మురళి అక్కడికి చేరుకున్నారు. ప్రకాష్ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, సమైక్య రాష్ట్రం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సహకరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ప్రకాష్ టవర్ నుంచి కిందకు దిగాడు. కాగా ఇతను టవర్ ఎక్కిన విషయం తెలియగానే విద్యుత్ శాఖ అధికారులు మెయిన్ సప్లై నిలిపివేశారు.
Advertisement