సమైక్యాంధ్రను కాంక్షిచేవారందరూ.. సమైక్య రాష్ట్ర తీర్మానం చేయాల్సిందిగా అసెంబ్లీలో పట్టుబట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు.
* ‘సాక్షి’తో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ఉద్ఘాటన
* రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన ప్రక్రియ
* తీర్మానం కోరకుండా నేరుగా ముసాయిదా బిల్లు పంపడం చట్టసభలను అవమానించడమే
* అసెంబ్లీ విభజనకు అనుకూలమా? ప్రతికూలమా ముందు తేలాలి
* ఈ అంశంపై సీఎం అనుబంధ తీర్మానం ప్రతిపాదించొచ్చు
* సమైక్య రాష్ట్రంపై చిత్తశుద్ధిలేనివారే సమైక్య తీర్మానానికి పట్టుబట్టరు
* విభజనపై సభల అభిప్రాయం తీసుకోకుండా డ్రాప్టుపై చర్చకు అర్థం లేదు
* ముసాయిదాపై చర్చకు అంగీకరించడమంటే.. విభజనకు అంగీకరించినట్లే!
* తీర్మానానికి అసెంబ్లీలో పట్టుబట్టాలేగాని.. సభనూ ఎవరూ బాయ్‌కాట్ చేయకూడదు
* బాయ్‌కాట్ చేస్తే టీ సభ్యులు చెప్పిందే సభ అభిప్రాయంగా కేంద్రానికి పంపే ప్రమాదముంది
* జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్ర విభజనపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రను కాంక్షిచేవారందరూ.. సమైక్య రాష్ట్ర తీర్మానం చేయాల్సిందిగా అసెంబ్లీలో పట్టుబట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, సమైక్యాంధ్రను కాంక్షించేవారు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (రాష్ట్రాల విభజన, కలపడం, సరిహద్దుల మార్పు) విషయంలో చట్టసభలకున్న అధికారాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
ఇది చట్టసభలను (ప్రజలను) అవమానించడమే. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం సుమోటోగా విభజన బిల్లు రూపొందించి శాసనసభ అభిప్రాయాల (వ్యూస్) కోసం పంపింది. ఇందులో కూడా రాష్ట్రాన్ని విభజించాలా? కలిపి ఉంచాలా? అనే ఆప్షన్ లేదు. అందువల్ల దీనిపై చర్చలో పాల్గొనడమంటే సూత్రప్రాయంగా రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లే అవుతుంది. అందువల్ల దీనిపై చర్చను అడ్డుకుని సమైక్య తీర్మానం కోసం సభ్యులు పట్టుబట్టాల్సిందే’ అని లక్ష్మణరెడ్డి స్పష్టం చేశారు.
జగన్‌మోహన్‌రెడ్డి మొదట నుంచి చేసిన డిమాండు ఇదే కదా!
రాష్ట్రానికి కేంద్రం నుంచి ముసాయిదా బిల్లు రాకముందే సమైక్య రాష్ర్టం కోసం అసెంబ్లీలో తీర్మానం చేద్దామని అన్ని రాజకీయ పక్షాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా ముందే విజ్ఞప్తి చేశారు. అప్పట్లో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఇదే ప్రతిపాదన చేశాను. రాష్ట్ర పునర్విభజనపై తీర్మానం కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఎటూ ప్రతిపాదన పంపుతుందని, అప్పుడూ వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ద్వారా తీర్మానం పంపితే బాగుంటుందని సీఎం చెప్పారు. కేంద్రం నుంచి ప్రతిపాదన రాకముందే మనం సుమోటోగా తీర్మానం పంపినా పక్కన పడేసే అవకాశం ఉందని సీఎం చెప్పడంతో ఆనాడు సంతృప్తి చెందాం. తర్వాత దిగ్విజయ్‌సింగ్, షిండేతోపాటు ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం చెప్పాల్సిందిగా ఒకసారి తీర్మానం కోరతారని, మరోసారి ముసాయిదా బిల్లు వస్తాయని ప్రకటించారు. ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీర్మానాన్ని కోరకుండా నేరుగా ముసాయిదా బిల్లునే పంపింది. ఇందులో కూడా రాష్ట్ర విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే క్లాజు లేదు. ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉంది.
ఆర్టికల్ 3 కింద రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం కేంద్ర ప్రభుత్వానిదే కదా?
రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించలేదు. రాష్ట్ర విభజనకు రెండు విధానాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం పంపితే దానిని కేబినెట్ ఆమోదించి తర్వాత ముసాయిదా బిల్లు రూపొందించి పంపడం ఒక విధానం. కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రాల పునర్విభజన కమిటీ(ఎస్‌ఆర్సీ) తరహాలో నిపుణుల కమిటీని వేయడం. ఆ కమిటీ నివేదికను పార్లమెంటులో చర్చించి పార్లమెంటు చేసే సవరణల ప్రకారం ముసాయిదా బిల్లును రూపొందించడం. మన రాష్ట్రం విషయంలో ఇవి రెండూ జరగలేదు. నేరుగా కేంద్రం తనకు నచ్చినట్లు ముసాయిదా బిల్లు రూపొందించింది. చట్టసభలు రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటే ఆర్టికల్ -3 ద్వారా దానిని అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మామూలుగా కూడా చట్టసభలు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే దాన్నిఅమలు చేసే అధికారం ప్రభుత్వానికి (కార్యనిర్వాహక వ్యవస్థకు) ఉంటుంది.
ఆర్టికల్ -3 సవరించాలనే డిమాండుపై..
కేంద్రం ప్రభుత్వమంటే అధికారపక్షమే. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్న ప్రస్తుత అధికార పక్షం తనకు అనుకూలించే రాజకీయ ధ క్పథంలో ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించే ప్రయత్నం చేస్తోంది. అందువల్లే రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఆంధ్రను కేంద్రం విభజిస్తున్న విషయాన్ని, ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరం గురించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ పార్టీల నేతలను కలిసి వివరించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం జగన్ చొరవ వల్ల ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆంధ్రను విభజిస్తే అంగీకరించబోమని, పార్లమెంటులో వ్యతిరేకిస్తామని వివిధ రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు చెప్పారు.
మరిప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ముందున్న పరిష్కారమార్గం ఏమిటి?
రాష్ట్ర విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే అంశంపై సభ అభిప్రాయం తీసుకుని ఓటింగ్ నిర్వహించాలని సభా నాయకుడైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించొచ్చు. సభలో ఎవరైనా అంశంపై ప్రైవేటు తీర్మానం ప్రతిపాదించినా స్పీకరు ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజనకు సంబంధించి తీర్మానం చట్టసభల నుంచే రావాలి. అయితే మన రాష్ట్ర విభజనకు సంబంధించి అటు పార్లమెంటులో గానీ, ఇటు అసెంబ్లీలోగానీ తీర్మానం జరగలేదు. కేంద్ర ప్రభుత్వమే సుమోటోగా ముసాయిదా బిల్లును రూపొందించి రాష్ట్రంపై రుద్దింది. ఇది చట్టసభలను అగౌరవపరచడమే. ఈ నేపథ్యంలో మన చట్టసభకు ఉన్న అధికారాన్ని వినియోగించుకునేందుకు సమైక్య తీర్మానం కోరుతూ సభ్యులు నోటీసు ఇస్తే స్పీకరు అనుమతించాల్సిందే. లేకపోతే మన సభ గౌరవాన్ని మన సభాపతే మంటగలిపినట్లు అవుతుంది. సభ గౌరవాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న స్పీకరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించలేరు.
రాష్ట్రపతి పంపిన ముసాయిదాకు ప్రాధాన్యం అంటున్నారు?
అసలు ఇది రాష్ట్రపతి పంపినది కాదు. కేంద్ర హోంశాఖ రూపొందించి పంపిన ముసాయిదా బిల్లు మాత్రమే. ప్రొసీజర్‌లో భాగంగా రాష్ట్రపతికి వెళ్లి వస్తుంది. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలు వెళ్లిన తర్వాత కేబినెట్ మళ్లీ దానిని రాష్ట్రపతికి పంపితే రాష్ట్ర విభజన బిల్లు ప్రతిపాదించాలా? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుని కేబినెట్‌కు పంపుతారు. అయితే రాష్ట్ర విభజనపై సభ అభిప్రాయాలు తెలియకుండా విభజనవల్ల తలెత్తే అంశాలపై సభలో ఎలా చర్చిస్తారు? ముందు విభజనకు అనుకూలమా? ప్రతికూలమా? అనే అంశం తేల్చాలి. విభనకు సభ అనుకూలమని (మెజార్టీ సభ్యుల అభిప్రాయాలే(వ్యూస్) సభ అభిప్రాయాలుగా పరిగణిస్తారు) సభ అభిప్రాయపడితే విభజన బిల్లుపై చర్చించవచ్చు. రాష్ట్రాన్ని విభజించవద్దని సభ అభిప్రాయపడితే తదుపరి ముసాయిదా బిల్లుకే విలువ ఉండదు.
క్లాజుల వారీ ముసాయిదా బిల్లుపై చర్చించాలని సీఎం అంటున్నారు?
అది అర్థరహితం. సీమాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. సీమాంధ్ర శాసనసభ్యులు కూడా రాజ్యాంగ విరుద్ధంగా, చట్టసభల తీర్మానం లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు పంపిందని, దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని బయట చెబుతున్నారు. ఇలాంటప్పుడు విభజన బిల్లుకు సంబంధించి క్లాజులపై ఎలా చర్చిస్తారు? చర్చను అంగీకరించడమంటే.. రాష్ట్ర విభజనను సూత్రప్రాయంగా అంగీకరించినట్లే కదా? ఇప్పుడు చర్చలో పాల్గొంటే .. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును పంపిందని సుప్రీంకోర్టులో ఎలా వాదిస్తారు? రాజ్యాంగ విరుద్ధమైతే చర్చలో ఎలా పాల్గొన్నారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే కేసు బలహీనపడుతుంది. అందువల్ల బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లో చర్చకు అంగీకరించరాదు.
రాష్ట్ర విభజన గురించి కేంద్రం ప్రకటించగానే సీమాంధ్ర రాజధాని కోసం రూ. 4 లక్షల కోట్లు ఇవ్వాలని డిమాండు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సమన్యాయం అంటూ తప్పించుకు తిరుగుతున్నారు.. సీఎం మాత్రం విభజనకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ క్లాజులవారీగా ముసాయిదా బిల్లుపై చర్చించాలంటున్నారు.. దీనిని ఏమనుకోవాలి?
అందుకే రాష్ట్ర విభజనకు అనుకూలమా? ప్రతికూలమా? అనే అంశంపై సభలో చర్చించాలని పట్టుబడితే సమన్యాయం అనేవారు, విభజనను అడ్డుకుంటామంటూ పరోక్షంగా సహకరించే వారి బండారం బయటపడుతుంది. విభజనకు వ్యతిరేకంగా నిలిచిందెవరో? ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా విభజనకు సహకరించేదెవరో ఓటింగ్‌లో తేలిపోతుంది. వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. అందుకే రాష్ట్ర విభజనను బహిరంగంగా వ్యతిరేకించకుండా గూడు పుఠాణి చేసేవారే, సమైక్య రాష్ట్రంపై చిత్తశుద్ధి లేనివారే తీర్మానం కోసం పట్టుబట్టకుండా వెనుకంజ వేస్తారు.
బహిష్కరించవద్దు
సమైక్య తీర్మానం కోసం సభ్యులు పట్టుబట్టాలేగానీ స్పీకరు అనుమతించకపోతే బాయ్‌కాట్ చేయరాదు. స్పీకరు సస్పెండు చేస్తే తప్ప సీమాంధ్ర సభ్యులెవరూ బాయ్‌కాట్ చేయరాదు. బాయ్‌కాట్ చేస్తే తెలంగాణ సభ్యులే అనుకూలంగా మాట్లాడి సభ అభిప్రాయం కింద కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రమాదం ఉంది. ఒక వేళ స్పీకరు సస్పెండ్ చేస్తే ఆ విషయం రికార్డు అవుతుంది. అప్పుడు సభ్యులంతా సమైక్యానికే కట్టుబడి ఉన్నట్లు అఫిడవిట్లు సమర్పించవచ్చు. మమ్మల్ని సభ నుంచి బహిష్కరించి అతి తక్కువమంది అభిప్రాయాన్నే సభ అభిప్రాయం కింద పంపారని వాదించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాన్ని రాష్ట్రపతితోపాటు కోర్టులు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి.