
రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* విభజనపై ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చేలోగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలి
* దీనికి వీలుగా తక్షణమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించండి
* గవర్నర్ నరసింహన్‌ను కోరిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వినతిపత్రం అందజేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై అభిప్రాయం కోరుతూ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చేలోగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేయడానికి శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాల ప్రయోజనాలను కాపాడడానికి వీలుగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని గవర్నర్‌కు విన్నవించారు.
ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి జగన్‌మోహన్‌రెడ్డి గురువారమిక్కడ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడానికి ముందే సమైక్యంగా ఉంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి వీలుగా చొరవ చూపించాలని గడిచిన సెప్టెంబర్ 30న సమర్పించిన వినతిపత్రం గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సీఎం మా అభిప్రాయాన్ని పట్టించుకోలేదు..
‘‘అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచినట్లయితే ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశమే కాకుండా, వైఖరిని కూడా తెలియజేసేందుకు వీలుంటుంది. నిరంకుశంగా చేసిన విభజన ప్రక్రియను నిలుపుదల చేయడానికి అనువుగా సమైక్య తీర్మానం చేసే అవకాశం లభిస్తుంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సెప్టెంబర్ 26న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా లేఖ రాశాం. కానీ దురదృష్టవశాత్తూ మా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు’’ అని వినతిపత్రంలో పేర్కొన్నారు.
‘‘తెలంగాణ అంశంపై కేబినెట్ నోట్‌ను ఆమోదించి, మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. బృందం తన మొదటి సమావేశంలోనే ప్రజాభీష్టాన్ని విస్మరించి, రాష్ట్రాన్ని చీల్చేందుకు కార్యాచరణను రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం జోక్యం చేసుకుని, అసెంబ్లీని సమావేశపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. డ్రాప్టు బిల్లు తయారవడానికి ముందే సమైక్య తీర్మానాన్ని ఆమోదించడం ఎంతైనా అవసరం. అసెంబ్లీలో మెజారిటీ ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చేసిన తీర్మానాన్ని గౌరవించాల్సి ఉంటుంది’’ అని విన్నవించారు.
దేశం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించండి..
‘‘విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరింత ముందడుగు వేయకుండా అసెంబ్లీని సమావేశపరచాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. విభజనపై మా వ్యతిరేకతను వ్యక్తంచేసి, జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలన్న మా ఆలోచనను దేశం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించాలి. అసెంబ్లీ తీర్మానం చేయాలన్న మౌలిక సంప్రదాయాన్ని విస్మరించి, కొన్ని ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజనకు సిద్ధపడటం సరికాదు.
18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్న బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా, రాష్ట్రంలోని అరవై శాతం జనాభా గత 70 రోజులుగా తమ నిరసనను వివిధ రూపాలలో వ్యక్తపరుస్తున్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. అసెంబ్లీని సమావేశపరిస్తే విభజనకు వ్యతిరేకంగా మా గళాన్ని వినిపించే వీలు దొరుకుతుంది. తద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నం చేయవచ్చు. తక్షణం అసెంబ్లీని సమావేశపరచాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని వినతిపత్రంలో పేర్కొన్నారు.