గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయుధ దళాల పరేడ్‌లో గవర్నర్ నరసింహన్
సాక్షి, అమరావతి: దేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, విభజన కష్టాలను సమర్థంగా ఎదుర్కొని, సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించిన గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పరేడ్ అనంతరం ప్రసంగించారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రికార్డ్ స్థాయిలో 190 రోజుల్లో తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి చేశామని, గ్రీన్‌ఫీల్డ్ అమరావతిని నిర్మిస్తామని వెల్లడించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశామని గవర్నర్ తెలిపారు. వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా ఈ రోజు గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని గవర్నర్ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. కాగా దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణతంత్ర వేడుకలకు గైర్హాజరయ్యారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి మనవడు దేవాన్ష్తో కలసి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment