వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు సమైక్య తీర్మానం పెడితే తెలంగాణ ఎమ్మెల్యేలంతా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి గురువారం హైదరాబాద్లో తెలిపారు. తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని కొన్నేళ్లుగా తాము కొరినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సమైక్య తీర్మానాన్ని ఇప్పుడెలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చిన ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజన బిల్లుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సీమాంధ్ర కేంద్రమంత్రులు,ఎంపీలు మాదిరిగా అసెంబ్లీలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు సహకరిస్తారని రాంరెడ్డి దామోదరరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే శాసనసభకు పంపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షుడు దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయన్ని అడ్డుకుంటే జరిగే పరిణామాలకు వారే బాధ్యులు అవుతురని ఆయన సీమాంధ్ర నేతలు, ఉద్యోగులకు పరోక్షంగా హెచ్చరించారు. అలాగే సభలో తెలంగాణ బిల్లు అడ్డుకుంటే భాగ్యనగరంలోని సీమాంధ్రులకు ఏదైన జరిగితే కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.