నేడు షర్మిల సమైక్య శంఖారావం | Samaikya Sankharavam today | Sakshi
Sakshi News home page

నేడు షర్మిల సమైక్య శంఖారావం

Published Thu, Sep 12 2013 4:55 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Samaikya Sankharavam today

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో మహానేత రాజన్న తనయ, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తిరుపతి వెంకన్న సాక్షిగా పూరించిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర చినవెంకన్న కొలువైన పశ్చిమగోదావరి జిల్లాలోకి దూసుకొస్తోంది. తెలుగువారంతా ఎప్పటికీ ఒక్కటిగా.. సుభిక్షంగా ఉండాలని కోరుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శాన్ని.. తెలుగు నేలను చీల్చకూడదన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాం క్షను.. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిందేనన్న విజయమ్మ దృఢ సంకల్పాన్ని ఆలంబనగా చేసుకుని షర్మిల సమైక్య శంఖారావం పూరించారు.
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర గురువారం జిల్లాలో ప్రవేశించనుంది. కృష్ణా జిల్లా కైకలూరులో బహిరంగ సభ అనంతరం షర్మిల పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. కలకుర్రు వంతెనపై యాత్ర జిల్లాలోకి రాగానే   స్వాగతం పలికేం దుకు దెందులూరు నియోజకవర్గ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ఏలూరు నగరం వరకూ షర్మిల బస్సుయాత్రను  మోటార్ సైకిళ్ల ర్యాలీతో నగరంలోకి తీసుకురానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు షర్మిల యాత్ర చేరుకుంటుంది. 
 
 అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద బహిరంగ సభలో ఆమె మాట్లాడతారు. షర్మిల సభ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌తోపాటు నగర మంతటా భారీగా స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఏలూరు నియోజకవర్గంతోపాటు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు సమైక్యవాదులు కూడా ఈ సభలో పెద్దఎత్తున పాల్గొననున్నారు. సభ ముగిసిన తర్వాత షర్మిల నగరంలోనే బస చేస్తారు.  శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శిస్తూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం చేరుకుంటారు.    ఏలూరుతోపాటు దెందులూ రు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగుతుంది.
 
 వైఎస్సార్ సీపీకి మద్దతు
 రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అలుపెరగకుండా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై  ప్రజలు ఆకర్షితులవుతున్నారు. పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఆందోళనల్లో తెలుగుదేశం పార్టీ నేతలను ఛీకొడుతున్న ఎన్జీవోలు, విద్యార్థులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆదరణ కనబరుస్తున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళన లో జేఏసీ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఈక్రమంలోనే షర్మిల బస్సుయాత్రకు మద్దతు ఇస్తామని ఇప్పటికే ఎన్జీవోలు ప్రకటించారు. బుధవారం ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు, సభ్యులు కూడా నగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపునకు వేదికలో భాగంగా ఉన్న ఎన్జీవోలు, వ్యాపారులు, విద్యార్థులు సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. 
 
 కొల్లేరు ప్రజల మద్దతు
 సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చిత్తశుద్ధితో చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొల్లేరు ప్రజలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. మంగళవారం లంక గ్రామాల పెద్దలు, నాయకులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. లంక గ్రామాల ప్రజలు షర్మిల యాత్రలో పాల్గొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే సరైన వేదికని కొల్లేరు పెద్దలు భావిస్తున్నారు.  షర్మిల యాత్రను విజయవంతం చేసేందుకు వారు రెట్టించిన ఉత్సాహంతో తరలివస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement