హైదరాబాద్: నరక చతుర్థి సందర్భంగా వాడవాడల నరకాసుర దహనాలను నిర్వహించారు. అయితే పురాణకాలం నాటి నరకుడికి బదులుగా ఈసారి సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పండగ రోజు కూడా సమైక్య నినాదానే ప్రతిధ్వనించింది. నరక చతుర్థి రోజున నరాకసుర దహనానికి బదులుగా రాష్ట్ర విభజనకు కారకులైన వారి దిష్టిబొమ్మలకు నరకాసుర దహనం నిర్వహించారు. రాష్ట్ర విభజనకు పూనుకున్న సోనియాగాంధీ, అందుకు సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్, విభజనకు కారకుడైన కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో కిరణ్, సోనియా, చంద్రబాబు, దిగ్విజయ్, కేసీఆర్‌ల దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును గాలికొదిలి నరకాసురుల్లా విభజించ చూస్తున్నారని వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నరకచతుర్దశి సందర్భంగా సత్తెనపల్లిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నరకాసురవధ నిర్వహించారు. నరకాసురిని బొమ్మతో పాటు రాష్ట్ర విభజనకు కారకులైన సోనియా, కిరణ్, చంద్రబాబు, కేసీఆర్ బొమ్మలను దహనం చేశారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతవరకైనా పోరాడతామని వైఎస్సార్ సీపీ నేతలు స్పష్టం చేశారు.
సమైక్యాంధ్ర కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని విడదీసేందుకు కుట్రపన్నుతున్న సోనియా గాంధీ కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలతో నరకాసురవధ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలతో హోరెత్తించారు.
సోనియా, బాబు, కిరణ్, కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం
Published Sun, Nov 3 2013 2:20 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement