విభజన బిల్లుపై పార్లమెంటులోనూ ప్రాంతాలవారీగా తమ వాణిని వినిపించాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు.
సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై పార్లమెంటులోనూ ప్రాంతాలవారీగా తమ వాణిని వినిపించాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో విభజన బిల్లు వస్తే అనుసరించాల్సిన వైఖరిపై శనివారం చంద్రబాబు నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్ మినహా పార్టీకి చెందిన మిగతా ఎంపీలు పాల్గొన్నారు. విభజన బిల్లును లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన వెంటనే సీమాంధ్ర ఎంపీలు నిరసన తెలపటంతోపాటు అడ్డుకోవాలని, అదే సమయంలో తెలంగాణ ప్రాంత ఎంపీలు బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సిందిగా ఆందోళన చేయాలని చంద్రబాబు సూచించారు.
టీడీపీ లేఖ ఇవ్వటంవల్లే రాష్ర్ట విభజన జరుగుతోందన్న అంశాన్ని ఢిల్లీ స్థాయిలో వివరించాలని, అదే సమయంలో ఆంధ్ర ప్రాంతానికి న్యాయం చేశాకే రాష్ట్రాన్ని విభజించాలని డిమాండ్ చేయాల్సిందిగా తెలంగాణ ఎంపీలకు సూచించారు. సమావేశానంతరం టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్టీ వైఖరి మారలేదన్నారు. అయితే సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేసేలా బిల్లు ఉండాలన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో సీమాంధ్రకు చెందిన పార్టీ ఎంపీలు సీఎం రమేష్, కొనకళ్ల నారాయణ, వైఎస్ చౌదరి, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఉభయసభల్లో బిల్లు ప్రవేశ పెట్టడాన్ని అడ్డుకుంటామని చెప్పారు.
రేపు ఢి ల్లీకి చంద్రబాబు
చంద్రబాబునాయుడు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉంటారు. సమన్యాయం చేసిన తరువాతనే రాష్ట్రాన్ని విభజించాలని కోరుతూ ఆయన రాష్ట్రపతితోపాటు వివిధ పార్టీల నేతలను కలిసి వినతిపత్రాలు అందచేస్తారు. ఆయన వెంట తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్య నేతలు వెళతారు.