అవనిగడ్డ: అక్రమ ఇసుక రవాణా కార్యకలాపాలపై కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం వాసుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే గ్రామంలోని ఇసుక రీచ్ వద్ద తవ్వకాలకు అనుమతి ఉండగా... అర్థరాత్రి వరకు కూడా యధేచ్చగా తవ్వకాలు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో ఇసుక తరలించే వాహనాలు వేగంగా వెళుతూ గ్రామస్తుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నరంటూ వారు సోమవారం ఉదయం ఇసుక రీచ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని, ఇటీవల ఇసుక వాహనం ఢీకొని మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, లెసైన్స్ లేని డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.