శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఇసుక ధర విషయంలో జిల్లా ఆధికారులు, మంత్రి దోబూచులాడుతున్నారు. పాలకులు, ఆధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో అయోమయం నెలకొంది. ధర తగ్గించాలని సాక్షాత్తు మంత్రి సూచించినా అధికారులు 95 జీవోను బూచిగా చూపి పాత ధరనే కొనసాగిస్తున్నారు. ఇసుక ధరను క్యూబిక్ మీటరుకు 675గా అధికారులు నిర్ణయించారు. దీన్ని రూ.550కి తగ్గించాలని జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇది జరిగి వారం రోజులు గడి చాయి. అయినా మంత్రి ఆదేశాలు అమలుకాలేదు. ధర తగ్గలేదు. అలాగే నాటుబళ్లవారికి ఉచింతంగా ఇసుక తవ్వుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ప్రజాప్రతినిధు లు కోరగా 95 జీవో ప్రకా రం అది సాధ్యం కాదని ఆధికారులు తోచిపుచ్చుతున్నారు. దీంతో నాటుబళ్ల వారికి ఉపాధి దూరం కాగా.. సామాన్యులకు ఇంటి నిర్మాణంగా భారంగా పరిణమించింది.
వినియోగం, నాణ్యతను బట్టి ఇసుకను ప్రభుత్వం మూడు రకాలు గా వర్గీకరించింది. కాంక్రీట్, ప్లాస్టరింగ్‌లకు వాడేదాన్ని మొదటి రకం గా గుర్తించి, క్యూబిక్ మీటరు ధరను రూ.675గా నిర్ణయించారు. సాధారణ కట్టడాలు, ఇతర అవసరాలకు వాడే ఇసుకను రెండో రకంగా గుర్తించి, ధరను రూ.462గా, పునాదుల్లో ఫిల్లింగ్‌కు ఉపయోగించే ఇసుకను మూడో రకంగా గుర్తించి, ధరను రూ.352గా నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికి 70 రీచ్‌లను గుర్తించగా, 12 రీచ్‌లకు మాత్రమే అనుమతులు వచ్చాయి. వీటిలో ఎనిమిది రీచుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఏ రీచ్‌లో ఏ రకం ఇసుక అందుబాటులో ఉందన్నదాన్ని ఇంత వరకు ఆధికారులు నిర్ణయించలేదు. దీనిపై అధికారుల్లోనే స్పష్టం లేదు.
దీంతో అన్ని రీచుల్లోనూ మొదటి రకం ధర రూ.675కే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది సామాన్యులకు మరింత నష్టం కలిగిస్తోంది. గుర్తించిన 70 రీచులకు అనుమతుల కోసం గత మూడు నెలలుగా జిల్లా అధికారులు కుస్తీలు పడుతున్నారు. వాటిన్నింటిలోనూ అమ్మకాల ప్రారంభానికి ఎంతకాలం పడుతుందో వారికే తెలియడంలేదు. గుర్తించిన వాటిలోనూ కల్లేపల్లి, పొన్నాడ, పురుషోత్తపురం, తలవరం వంటి రీచుల్లో వివాదాలు రేగుతున్నాయి. కొన్ని రీచ్‌లను స్థానికులు అడ్డుకొంటుంటే.. మరికొన్నింటిలో ఆధికారుల వైఫల్యం, టీడీపీ కార్యకర ్తల ఆధిపత్యం వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇసుక ధర క్యూబిక్ మీటరు రూ.70కి తగ్గించాలని భవన కార్మికులు, వినియోగదారులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి మధ్య మూడు నెలలుగా పనులు లేక నిర్మాణ కార్మికులు వలస పోతున్నారు.
కమిటీ సమావేశం తర్వాతే..: కాగా కమిటీల నిర్ణయం తర్వాతే ధర తగ్గింపుపై పునరాలోచిస్తామని జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జిల్లా స్టాయి ఇసుక నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించి, ప్రభుత్వ నిబంధనలు, జీవో 95లోని వివరాలు పరిశీలించన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు, ఆ కమిటీలోనే నిపుణులు ఉంటారని, వారు ఇసుక రకాలను నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.
ఇసుక ధరపై దోబూచులాట!
Published Sun, Dec 7 2014 2:03 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement