వాల్టా.. ఉల్టా!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:పచ్చదనానికి ఎసరు పెడుతున్నారు. నీరు, భూమి, వృక్షం ఇలా దేన్నీ విడిచిపెట్డడం లేదు. మొత్తంగా వాల్టా చట్టాన్నే ఉల్లంఘిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి అన్నిచోట్ల నదులు, కాలువలు.. అని చూడకుండా ఇసుక కనిపిస్తే తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో నాగావళి నదికి ఇరువైపులా అనేక చోట్ల ఇసుక రీచ్‌ల నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఆదాయమే పరమావధిగా తెలుగుదేశం నేతలూ ఇందుకు వంతపాడుతున్నారు. ఈ విషయమై ఇటీవల బూర్జ, పొందూరు, ఆమదాలవలస మండలాలకు చెందిన కొంతమంది జాయింట్ కలెక్టర్‌ను కలిసి జిల్లా పరిస్థితులను వివరించారు. ఇదే విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి, మైన్స్ విభాగం ఏడీల దృష్టికి తీసుకువెళ్లారు. ఆమదాలవలస గోపీనగరం ప్రాంతంలో గతంలో ఇసుక దందాలను నివారించేందుకు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులను చంపుతామని కూడా బెదిరించారని ఆ ప్రాంత వాసులు గుర్తుచేస్తున్నారు. ఈ ప్రాంతంలో రీచ్‌ల్ని ప్రారంభిస్తే మాఫియా చెలరేగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది
వాల్టా-2002 చట్టంలోని సెక్షన్ 27 రూల్ 2, 3 ప్రకారం గ్రామీణ, పట్టణ సురక్షిత మంచి నీటి పథకాలున్న ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు నిషిద్ధం.
{బిడ్జిలు, ఆనకట్టలకు 500 మీటర్ల పరిధిలోపు క్వారీలు ఉండకూడదు.
ఇసుక పొర మూడు మీటర్ల మందం ఉన్న ప్రాంతాల్లో ఒక మీటర్ వరకు తవ్వుకోవచ్చు.
నది తీరంలో 15 మీటర్ల లోపు, నది వెడల్పులో 5వ వంతు లోపు ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లకు అనుమతి లేదు.
రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ గణాంకాల సంస్థ (సీయ్) నిబంధనల ప్రకారం కార్మికులతోనే ఇసుక ఎత్తించాలి. యంత్రాల వినియోగం కూడదు.
వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇసుక తవ్వరాదు.
రీచ్‌ల కారణంగా వ్యవసాయం, మంచినీరు, పరిశ్రమలకు ఎలాంటి ఆటంకం ఉండకూడదు.
కేవలం పగటిపూట మాత్రమే తవ్వకాలకు అనుమతించాలి.
తీరం నుంచి ముఖ్య రహదారికి ఆనుకుని ఇరువైపులా చెట్లు నాటాలి.
భవిష్యత్తు ఇసుక రీచ్‌లివే
ఈ నిబంధనల్లో చాలావాటిని ఉల్లంఘిస్తూ పలు కొత్త రీచులను అధికార యంత్రాంగం గుర్తించింది. ఆమదాలవలస మండలం నిమ్మతొర్లువాడ, కొరపాం, గరిమెళ్ల కొత్తవలస, తొగరాం, దిబ్బలపేట, ముద్దాడపేట, దూసి, తోటాడ, నెల్లిమెట్టతోపాటు పొందూరు మండలం గంద్రేడు, సింగూరు బొడ్డేపల్లి, బూర్జ మండలం లాభాం, గుత్తావల్లి, చిన్నలంకాం ప్రాంతాల్లో కేవలం ఆదాయం కోసమే రీచుల నిర్వహణకు అనుమతిలిచ్చేందుకు రంగం సిద్ధం చేశారని తెలిసింది. ఇప్పటికే కాఖండ్యాంలో ఈ విధంగా అనుమతిలిచ్చి ప్రజాగ్రహం చవిచూశారు.
ఇవీ నష్టాలు
కొత్త ఇసుక రీచ్‌లొస్తే నారాయణపురం ఆనకట్టకు ప్రమాదం వాటిల్ల వచ్చు.
ఇక్కడ సుమారు 50 వేల క్యూసెక్కుల ప్రవాహం సాగరంలో కలుస్తోంది.
చిన్నలంకాం, లాభాం, గుత్తావల్లి, గరిమెళ్ల కొత్తవలస, కొరపాం ప్రాంతాలు నదీప్రవాహం ఎదురుగా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తొగరాం సహా రక్షణ కవచం ఉండదు.
ఇప్పటికే ఇసుకలపేట, కొత్తవలస, దిబ్బలపేట గ్రామాలు పూర్తిగా కోతకు గురయ్యాయి. ముద్దాడపేట ప్రాంతానిదీ ఇదే పరిస్థితి. దూసి ప్రాంతంలో ఉన్న రైల్వే బ్రిడ్జికి కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.