
ఇసుక దుమారం
=అధికారులను వెంటాడుతున్న వివాదం
=పామర్రు రీచ్‌ల కోసం ఉద్యమం
=రాజకీయ నేతల ఆధిపత్య పోరు
ఇసుక రీచ్‌ల దుమారం ప్రభుత్వ యంత్రాంగాన్ని చుట్టేస్తోంది. ఇసుక వివాదాలు మళ్లీ రాజుకోవడం అధికారుల కంట్లో నలుసులా మారింది. క్వారీలు కొందరు రాజకీయ నాయకులకు కాసులు కురిపించే గనులుగా మారడంతో అధికార కాంగ్రెస్‌లోనే ఆధిపత్యపోరుకు తెరలేచింది. తాజాగా ఇసుక వివాదంలోనూ అధికారులకు అండగా ఒక కీలక నేత, వ్యతిరేకంగా మరో నేత వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాజాగా సోమవారం పామర్రువాసులు చేపట్టిన ఆందోళన అధికారులకు మరింత తలనొప్పిగా మారింది.
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా ప్రభుత్వ యంత్రాంగాన్ని సైతం తమ కనుసన్నల్లో నడిపించే ప్రయత్నం చేస్తోంది. ఇసుక ర్యాంపులు కొందరికి కాసులు రాల్చే గనుల్లా మారిపోయాయి. వివాదాస్పదమైన కొన్ని ర్యాంపులను ఇటీవల అధికారులు సీజ్ చేశారు. తాజాగా కొన్ని ఇసుక రీచ్‌లకు అనుమతి ఇచ్చారు. దీంతో తమ ప్రాంతానికి చెందిన ఇసుక రీచ్‌లకు కూడా అనుమతి ఇవ్వాలంటూ పామర్రు నియోజకవర్గానికి చెందిన పలువురు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు.
పామర్రు నియోజకవర్గంలోని రొయ్యూరు, వల్లూరుపాలెం, వల్లూరు, భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, కళ్లవారిపాలెం, దేవరపల్లి, ఐలూరు ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. మాజీ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మోర్ల రామచంద్రరావు, పామర్రు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోడెడ్ల వెంకటేశ్వరరావు, ఉయ్యూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేరుగు సుబ్బారావు, మోటూరు శ్రీనివాసరావు, చొప్పవరపు బాబు, సుంకర చినరాఘవరావు తదితరులు ఆందోళన అనంతరం కలెక్టర్, జేసీలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
పశ్చిమ కృష్ణాలో ఇసుక రీచ్‌కు ఇటీవల వేలం నిర్వహించిన అధికారులు తూర్పు కృష్ణాలో ఒక్క క్వారీ కూడా తెరవలేదని ఆందోళనకారులు ఆరోపించారు. ఇసుక రీచ్‌లకు అనుమతి ఇస్తే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సమకూరుతుందని, తమకు క్వారీల్లో ఉపాధి దక్కుతుందని ఆందోళనకారులు ప్రస్తావించారు. ఈ విషయమై కలెక్టర్ ఎం.రఘునందనరావు స్పందిస్తూ తూర్పు కృష్ణా ప్రాంతంలో ఒక ఇసుక క్వారీనైనా తెరిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జేసీ పి.ఉషాకుమారి మాట్లాడుతూ ఆయా మండలాల తహసిల్దార్‌ల నుంచి నివేదికలు రప్పించుకుని ఇసుక క్వారీలను తెరిపించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
ఇసుక దుమారం వెనుక ఎమ్మెల్యే దాస్?
ఇసుక దుమారం వెనుక పామర్రు ఎమ్మెల్యే డీవై దాస్ ప్రమేయం ఉందన్న ప్రచారం సాగుతోంది. గతంలో పామర్రు ప్రాంతంలోని ఇసుక క్వారీలకు అనుకూలంగా డీవై దాస్ నేరుగా కలెక్టర్ వద్దే పంచాయితీ పెట్టిన సంగతి తెల్సిందే. అప్పట్లో నేరుగా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారిని లక్ష్యంగా చేసుకుని ఇసుక దుమారం రేపారు. అయినా ఆయన పంతం నెగ్గకపోవడంతో కలెక్టర్, జేసీల బదిలీకి ప్రయత్నాలు చేశారు. కారణాలు ఏవైనా కలెక్టర్, జేసీలకు ఏకకాలంలో బదిలీ వేటు పడింది. కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి బదిలీపై వెళ్లిపోవడం, జేసీ ఉషాకుమారి వెళ్లకపోవడం ఎమ్మెల్యేకు మింగుడుపడటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన అనుచరులతో మరోమారు ఉద్యమానికి వ్యూహరచన చేసినట్టు సమాచారం.
ఇసుక తుపాను...
కాసులు కురిపించే ఇసుక రీచ్‌ల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగుతోంది. పామర్రు నియోజకవర్గంలోని ఎనిమిది ఇసుక రీచ్‌లకు అనుమతిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయన్న కారణాలు చూపినా.. పరోక్షంగా దాస్‌కు లబ్ధి కలుగుతుందని భావించిన ఒక కీలకనేత అడ్డుచక్రం వేస్తున్నట్టు సమాచారం. అందుకు జిల్లాలోని ఒక అధికారి సైతం కీలకనేత ఆశీస్సులతో పామర్రు ఇసుక క్వారీలు తెరుచుకోకుండా సాంకేతిక మెలికలు పెడుతున్నట్టు వినికిడి. ఇప్పటికే పశ్చిమ కృష్ణాలో ఒక రీచ్‌కు అధికారులు అనుమతి ఇవ్వడంతో పామర్రు ప్రాంతంలోని క్వారీల విషయంలో ఒత్తిడికి గురవుతున్నారు. మొత్తానికి మళ్లీ మొదలైన ఇసుక తుపాను ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.