- నగరపాలక సంస్థ అధికారులకు ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ సూచన
- ఒక్కో హోటల్‌లో 15 గదుల కేటాయింపు
- నగరంలో చెత్త సమస్య తలెత్తకుండా చర్యలు
కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వీఐపీలొస్తున్నారు... నగరాన్ని శుభ్రంగా ఉంచండి... హోటల్ రూమ్స్ బుక్ చేయండి అంటూ ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ నుంచి నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు అందాయి. చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి.రత్నావళి శుక్రవారం నుంచి ఆదిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం సుమా రు 20 వరకు ప్రముఖ హోటళ్ళు ఉన్నాయి.
ఒక్కో హోటల్‌లో 15 రూంలు వీఐపీలకు జూన్ 6 నుంచి 8 వరకు కేటాయించాల్సిందిగా సీఎంహెచ్‌ఓ హోటల్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలోని స్థలంలో జూన్ 8న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న విషయం విదితమే. ఈక్రమంలో రెండు రోజుల ముందుగానే వీఐపీలు నగరానికి చేరుకొనే అవకాశం ఉంది. రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు ఆదిశగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని ఉన్నతాధికారులు రెండు రోజుల పాటు నగరంలో ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజులు నగరంలో చెత్త సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రత్నావళిని ఆదేశించారు. ప్రణాళికను రూపొందించుకోవాలని, లోటుపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంహెచ్‌ఓకు సూచించారు. ఈమేరకు ఆమె యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు.