'సత్యం’రామలింగరాజు సతీమణికి జైలుశిక్ష
'సత్యం’రామలింగరాజు సతీమణికి జైలుశిక్ష
Published Fri, Jan 10 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
రామలింగరాజు సతీమణి సహా 20 మంది కుటుంబసభ్యులకు జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను ఎగవేత కేసులో సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బి.రామలింగరాజు కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. రామలింగరాజు కుటుంబానికి చెందిన 19 అనుబంధ కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్న 20 మందికి నాంపల్లిలోని ప్రత్యేక ఆర్థిక నేరాల న్యాయస్థానం జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష ఉత్తర్వుల అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది. జైలుశిక్ష పడిన వారిలో రామలింగరాజు సతీమణి బి.నందినీరాజు, కుమారుడు బి.తేజరాజు, సోదరులు బి.రామరాజు, బి.సూర్యనారాయణరాజు, సోదరుడి భార్య బి.రాధారాజు, మాజీ సీఎఫ్‌వో ఎన్.రామరాజులతో పాటు పలువురు సమీప బంధువులు ఉన్నారు.
మహిళా డెరైక్టర్లకు ఆర్నెల్ల జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా విధించగా, మిగిలిన వారికి ఏడాది జైలు, రూ. 10 వేల జరిమానా విధించింది. శిక్ష పడిన నిందితులంతా అప్పటికప్పుడు రూ. 8.40 లక్షలు పూచీకత్తు చెల్లించి ఇంటికి వెళ్లారు. రామలింగరాజుకు చెందిన మరో సంస్థ మేటాస్ హిల్‌కౌంట్ నిర్మించిన అపార్ట్‌మెంట్, విల్లాలకు ఈ 19 అనుబంధ సంస్థల పేరు మీద భూముల బదలాయింపు జరిగింది. మేటాస్ సంస్థ తనకు వచ్చిన ఆదాయాన్ని ఈ 19 కంపెనీలకు ఇచ్చింది. ఈ కంపెనీలు కూడా రికార్డుల్లో ఆ ఆదాయాన్ని చూపించాయి. పెట్టుబడి లాభాలకు ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఆదాయాన్ని చూపుతూ రిటర్న్స్ దాఖలు చేసిన ఈ కంపెనీలు, పన్ను మాత్రం చెల్లించలేదు. ముందస్తు పన్ను చెల్లింపులూ చేయలేదు. ఈ కంపెనీలన్నీ ఆదాయ పన్ను శాఖకు రూ. 90 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు బకాయి పడ్డాయి. పన్ను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ ఈ కంపెనీలకు నోటీసులు జారీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో... అవి ఆదాయ పన్ను ఎగవేశాయంటూ ఐటీ విభాగం ప్రత్యేక ఆర్థిక నేరాల న్యాయస్థానంలో ఫిర్యాదులు చేసింది. వీటిపై విచారించిన కోర్టు... ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 276సీ(2) కింద పన్ను చెల్లించకపోవడాన్ని నేరంగా పరిగణిస్తూ ఆయా డెరైక్టర్లకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
19 అనుబంధ కంపెనీలివే...
నాగవల్లి గ్రీన్‌ల్యాండ్స్, గోమతి ఆగ్రోఫార్మ్స్, నల్లమల ఆగ్రోఫార్మ్స్, చిత్రావతి ఆగ్రోఫార్మ్స్, గోమన్ ఆగ్రోఫార్మ్స్, కాంచన్‌జంగా గ్రీన్‌ల్యాండ్స్, హిమగిరి గ్రీన్‌ఫీల్డ్స్, కోనార్ గ్రీన్‌ఫీల్డ్స్, హిమగిరి బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, మేదరవతి ఆగ్రోఫార్మ్స్, సింధూ గ్రీన్‌ఫీల్డ్స్, స్వర్ణగిరి గ్రీన్‌ఫీల్డ్స్, వింధ్యా గ్రీన్‌ల్యాండ్స్, వార్దా గ్రీన్‌ఫీల్డ్స్, యమునా ఆగ్రోఫార్మ్స్, వంశధార ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, పర్బతి ఆగ్రోఫార్మ్స్, ఉత్తరాషాడ బయోటెక్ లిమిటెడ్, స్వర్ణముఖి గ్రీన్‌ఫీల్డ్స్
కంపెనీల్లో డెరైక్టర్లు వీరే...
బీవీఎస్ సుబ్బరాజు, ఐవీ కృష్ణంరాజు, బి.ఝాన్సీ, ఎన్.రామరాజు, బి.నందినీరాజు, ఏవీ రాఘవరాజు, బి.రాధారాజు, బి.సూర్యనారాయణరాజు, ఎం.సూర్యనారాయణరాజు, బి.తేజరాజు, కె.గోపాలకృష్ణరాజు, మంతెన హరిప్రసాద్‌రాజు, ఎన్‌ఎస్‌ఎల్‌ఆర్ ప్రసాదరాజు, మల్లప్పరాజు, డి.శ్రీనివాసరాజు, కె.గోపీకృష్ణంరాజు, కేవీవీ కృష్ణంరాజు, జానకీరామరాజు, డీజీకే రాజు, బి.రామరాజు
Advertisement
Advertisement