
సీమ హక్కులు కాపాడకుంటే మరో ఉద్యమం
రాయలసీమ హక్కులను కాపాడకపోతే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో ఉద్యమం తప్పదని ఆ ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు
{పభుత్వానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల హెచ్చరిక
శ్రీశైలం డ్యాంను ముట్టడించిన ప్రజా, రైతు సంఘాలు
కర్నూలు: రాయలసీమ హక్కులను కాపాడకపోతే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో ఉద్యమం తప్పదని ఆ ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీశైలం డ్యాంలో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉంచాలని డిమాండ్ చేస్తూ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ రైతు సంఘాల నేతలతో గురువారం శ్రీశైలం రిజర్వాయర్‌ను ముట్టడించారు. అంతకుముందు సున్నిపెంటలోని నీటిపారుదలశాఖ అతిథిగృహం నుంచి సుమారు 8 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. శ్రీశైలం జలాశయం వద్ద ఉన్న ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాయలసీమకు సాగు, తాగునీటి సౌకర్యం కోసం చర్యలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని భూమా విమర్శించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నీటికి, ఉద్యోగుల జీతాలకే దిక్కులేకుంటే రాష్ట్రాన్ని సింగపూర్ ఎలా చేస్తారని చంద్రబాబును ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రశ్నించారు. శ్రీశైలం డ్యామ్ ముట్టడి కార్యక్రమంలో కర్నూలు, పాణ్యం, నందికొట్కూరు, కోడుమూరు, డోన్, కదిరి ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, ఐజయ్య, మణిగాంధీ, బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి, చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు దశరథరామిరెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, కృష్ణారెడ్డి, బీజేపీ నాయకుడు నిమ్మకాయల సుధాకర్ తదతరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకుడు బుడ్డా శేషారెడ్డి అధ్యక్షత వహించారు.