ప్లాన్ ప్రకారమే...
అమలాపురం :ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో దళిత కాలనీల్లో చేపట్టిన రహదారుల నిర్మాణాన్ని నిలుపుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. తద్వారా ఎస్సీ, ఎస్టీల ప్రాంతాల్లో నిధులు కచ్చితంగా ఖర్చు పెట్టాలనే చట్టాన్ని బాబు సర్కారు అపహాస్యం చేసినట్టయింది.దళితులు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించే 15 శాతం నిధులను మిగిలిన ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని, దీనివల్ల దళితులు నివసించే ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం చేసింది. ఈ క్రమంలో తమ ప్రాంతాల అభివృద్ధికి ఢోకా ఉండదని దళితులు భావించారు.
సబ్‌ప్లాన్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో గత ప్రభుత్వం జిల్లాలోని అనేక గ్రామాల్లో రూ.21.20 కోట్లతో సుమారు 415 సీసీ రోడ్లు నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. రూ.5 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లను ఎంపీడీఓ సమక్షంలో గ్రామసభలు పెట్టి పనులను గుర్తించారు. నిధులు కేటాయించిన అనంతరం మున్సిపల్, స్థానిక, సాధారణ ఎన్నికలు రావడంతో ‘కోడ్’ కారణంగా చాలా చోట్ల పనులు చేపట్టలేకపోయారు. జిల్లాలో ఇప్పటివరకు కేవలం పదిశాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. నిధుల వినియోగానికి గడువు పెట్టకపోవడం కూడా పనులు మందకొడిగా సాగడానికి కారణమైంది.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పనులు కొనసాగించాలని పంచాయతీరాజ్ శాఖ భావించింది. అయితే ఇటీవల పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో సబ్‌ప్లాన్ పనులు నిలిపివేయాలని జీఓ ఎంఎస్ నంబరు 389 జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న రహదారుల నిర్మాణాలు స్తంభించాయి. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసినా బిల్లులు వస్తాయన్న నమ్మకం లేక కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు.
కేటాయించిన నిధులను ప్రభుత్వం నిలిపివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సర్పంచ్‌లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, దళిత సంఘాలు మండిపడుతున్నాయి. సబ్‌ప్లాన్ చట్టం ద్వారా తమకు మేలు జరుగుతుందనుకుంటే.. చంద్రబాబు ప్రభుత్వం దానిని అపహాస్యం చేస్తూ జీఓ జారీ చేయడం సమంజసంగా లేదని దళిత సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. తక్షణం ప్రభుత్వం జీఓ 389ను ఉపసంహరించుకుని, సబ్‌ప్లాన్ నిధులతో పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.