దారి మళ్లిన సొమ్ము..! | Scholarships on Irregulars danda in Private colleges | Sakshi

దారి మళ్లిన సొమ్ము..!

Published Tue, Apr 26 2016 3:27 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

దారి మళ్లిన సొమ్ము..! - Sakshi

దారి మళ్లిన సొమ్ము..!

* డబ్బు స్వాహా చేయడంలో అజయ్‌ది కీలకపాత్ర
* ఉద్యోగులకు వాటాలు
* 18 ఖాతాలకు ఉపకారవేతనాలు జమ
* ఆరుగురు వార్డెన్ల ఖాతాలకు రూ.లక్షలు
* స్కాలర్‌షిప్‌ల స్కాంలో ఇదో కోణం
* కొనసాగుతున్న ఖాతాల పరిశీలన
* ప్రైవేటు కాలేజీల ఖాతాలపైనా అనుమానం

శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్: జిల్లాలో కొన్ని రోజులుగా కుదిపేస్తున్న స్కాలర్‌షిప్‌ల కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్విన కొద్దీ అక్రమార్కుల దందా వెలుగుచూస్తోంది.

ఈ స్కాంలో  కంప్యూటర్ ఆపరేటర్ అజయ్‌కుమార్ ప్రధాన సూత్రధారి.  ఆయన ప్రస్తుతం పాలకొండలో ఉంటూ అల్లరి చిల్లరగా ఆట్లాడుకుంటున్నాడు. ఉద్యోగులకు సొమ్ము ఎరచూపి కుంభకోణంలోకి దింపాడు. రూ.లక్షల్లో నిధులు దారి మళ్లించి పెద్దమొత్తాలను సొంతచేసుకున్నాడు.
 
పథకం ప్రకారం...
చేతిలో చిల్లిగవ్వలేకుండా కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరిన అజయ్‌కుమార్ తన తెలివితేటలకు పదును పెట్టాడు. అక్రమ మార్గాన డబ్బు సంపాదించేందుకు వ్యూహ రచన చేశాడు. పాలకొండలోనే ఉంటూ అటు బీసీ సంక్షేమ శాఖ, ఇటు గిరిజన సంక్షేమ శాఖలోని మూలాలను తెలుసుకున్నాడు. అక్కడున్న ఉద్యోగులతో మచ్చిక పెంచుకున్నాడు. అతనివద్ద ఉపకార వేతన దరఖాస్తులను ఆన్‌లైన్ చేసే ఉద్యోగులకు డబ్బుసంపాదన మార్గాలను వివరించాడు.

పాలకొండలో ఉంటున్న డే స్కాలర్ విద్యార్థులు హాస్టల్లో ఉన్నట్టు చూపిస్తే అదనంగా డబ్బులు వస్తాయని, అందులో వాటాలు పంచుకుందామని చెప్పి ఉన్నతాధికారులను సైతం ముగ్గులోకి దింపాడు. విద్యార్థులకు చేరాల్సిన ఉపకారవేతనాలు వారి ఖాతాలకు జమచేసి మిగిలిన మొత్తాలను ఎలా కొట్టేయాలో హితబోధ చేశాడు.

ఇది నమ్మిన ఉద్యోగులందరూ ఆయన గుప్పెట్లోకి వెళ్లిపోయారు. రూ.లక్షల నిధులు తమ ఖాతాలకు చేరేలా అకౌంటు నంబర్లు సహితం అప్పగించేశారు. అలా అప్పగించిన వారంతా గిరిజన సంక్షేమ శాఖ వార్డెన్లే కావడంతో బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని నిధులు దారిమళ్లించేశాడు. ఇదంతా ఆన్‌లైన్లో జరిగిన వ్యవహారమే కావడంతో పెద్దగా కంప్యూటర్ నాలెడ్జ్‌లేని వార్డెన్లంతా ఆయన చెప్పినట్టే చేశారు.
 
పంచుకున్నారు...
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 80 వేల మంది బీసీ విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 4వేల మంది గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య నభ్యసిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు మరో 10 వేల మంది చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ.35 వేలకు పరిమితం చేసింది. దీంతో వారు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లో కొన్నింటిని స్కాలర్‌షిప్‌లకు బదులు  వసతిగృహాలకు మళ్లించారు.

డే స్కాలర్‌కు నెలకు రూ.325 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే వసతిగృహాల కింద నమోదుచేస్తే నెలకు రూ.1050 అందజేస్తుంది. రూ.7 వేలు అదనంగా వచ్చి చేరుతుండడంతో డే స్కాలర్లుగా ఉన్న బీసీ విద్యార్థులను గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్నట్టు చూపించారు.

నిధులను కైంకర్యం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులు సస్పెండయ్యారు. మరో అధికారి సస్పెన్షన్‌లోనే ఉన్నారు. మరికొంత మందిపై విచారణ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బీసీ పోస్టు మెట్రిక్ హాస్టళ్ల ఖాతాలు పరిశీలిస్తే దారిమళ్లిన స్కాలర్‌షిప్‌లు బయటపడే అవకాశం ఉందని, ఆ దిశగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టిసారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
 
ఇరుక్కున్నారు...
మెళియాపుట్టి సబ్‌డివిజన్ పరిధిలోని అందరు వార్డెన్లు అజయ్ కుమార్ ఉచ్చులో ఇరుక్కున్నారు. ప్రధాన భూమిక పోషించిన ఏటీడబ్ల్యూ ఎర్రన్నాయుడితోపాటు మరో ఆరుగురు వార్డెన్లు ఖాతాలకు స్కాలర్‌షిప్ నిధులు మళ్లించారు. ఆ డబ్బును తీయించి సగం సగం పంచుకున్నారు. ఇప్పుడు అక్రమాలు వెలుగు చూస్తుండడంతో వార్డెన్లు కలవరపడుతున్నారు.
 
ఖాతాల గుర్తింపు...
ఇప్పటివరకు ఆరుగురు గిరిజన సంక్షేమ శాఖ వార్డెన్ల ఖాతాలకు నిధులు మళ్లించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో సీతంపేట బాలురు గిరిజన సంక్షేమ శాఖ పోస్టు మెట్రిక్ హాస్టల్ వార్డెన్ రాజారావు ఖాతాకు రూ.4 లక్షల నిధులు మళ్లినట్టు నిర్ధారించారు. మిగిలిన వారిని సైతం భాగస్వాములు చేర్చేందుకు వారి ఖాతాలకు స్వల్ప మొత్తాలను బదలాయించారు. పాలకొండ పోస్టు మెట్రిక్ బాలికల వసతిగృహంతో పాటు సీతంపేట బాలికల వసతిగృహం ఖాతాలకు పెద్దమొత్తాల్లో బిల్లులు జనరేటు చేసినా అందులో కేవలం రూ.15 వేలు మాత్రమే జమైంది. నిధుల మళ్లింపులో మరో 12 ఖాతాలను తెరవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement