పాఠశాల బాలికలు
ఆడపిల్లలు. అందులోనూ పాఠశాలకువెళ్లే బాలికలు. ‘నెలసరి’కి వారికి తోడ్పడే పథకానికి మంగళం పాడేశారు. ఇక్కడా వ్యాపార దృక్పథాన్ని పాటిస్తున్నారు. సరఫరాకు ఒకే కాంట్రాక్టర్‌ను నియమించాలన్న ఉద్దేశంతో ఎడతెగని జాప్యం చేస్తున్నారు. దేశం మొత్తం ఇప్పుడు శానిటరీ నాప్‌కిన్స్(ప్యాడ్స్)పై విస్తృత చర్చ జరుగుతోంది. మహిళల కనీస అవరసంగా వాటిని గుర్తించి అందుబాటులో ఉంచాలనే డిమాండ్ పెరుగుతోంది. బాలీవుడ్‌లో ఇదే విషయాన్ని కథాంశంగా తీసుకుని నిర్మించిన చిత్రంతో మొదలైన చైతన్యం ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అందరినీ కదిలిస్తోంది. అయినా మన సర్కారు మాత్రం కరగడం లేదు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు 1,11,857 మంది ఉన్నారు. వీరిలో దాదాపు 60 శాతం మందికి శానిటరీ నాప్‌కిన్స్ అవసరం ఉంటుందని అంచనా. కానీ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న వారికి మాత్రమే నాలుగేళ్లుగా ప్రభుత్వం నాప్‌కిన్స్ అందజేస్తోంది. అదీ కేజీబీవీల్లో 6,600 మంది ఉంటే 4,400 మందికే ఇస్తోంది. వీరికి కూడా నిత్యం కాకుండా అప్పుడప్పుడూ సరఫరా చేస్తోం ది. గడచిన ఏడాదిలో కేవలం రెండు నెలలకు సరిపడా మాత్రమే ఇచ్చింది. దేశవ్యాప్తంగా శానిటరీ నాప్‌కిన్స్‌పై చర్చ జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో గాని, జిల్లాలో గాని అధికారుల్లో చలనం రావడం లేదు.
ఒకే కాంట్రాక్ట్ కోసం కాలయాపన
గత ప్రభుత్వం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న బాలికలకు నాప్‌కిన్స్‌ని సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా పంపిణీ చేసింది. తర్వాత వచ్చినటీడీపీ ప్రభుత్వం కేవలం కేజీబీవీ బాలికలకు మాత్రమే పరిమితం చేసింది. వారికి కూడా ఈ విద్యాసంవత్సరంలో డిసెంబర్ 2017 పంపిణీ చేయనేలేదు. జనవరి 2018లో రెండు నెలలకు సరిపడినన్ని మాత్రమే పంపిణీ చేశారు. అంటే అవి ఈ నెల వరకూ వస్తాయి. ఒక ప్యాక్‌లో 7 వరకు నాప్‌కిన్స్ ఉంటాయి. ఆ ప్యాక్ ఖరీదు రూ.35 ఉంటుంది. ఏటా ఎన్ని అవసరం అనేది లెక్కగట్టి సర్వశిక్ష అభియాన్ ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంటుంది. అయితే రాష్ట్రం మొత్తం మీద ఒకే కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ యోచన విద్యార్ధినులకు శాపంగా మారింది.
రెండేళ్లలో రెండు నెలలకే
గ్రామీణ ప్రాంతాల్లోని కౌమార బాలికలు, విద్యార్థినుల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సర్వశిక్షాభియాన్ నిధులతో కేంద్ర ప్రభుత్వం ‘నేస్తం’ పథకం పేరుతో నాప్‌కిన్లు సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఏడు, ఎనిమిదోతరగతి విద్యార్థినుల కోసం 2012–13, 2013–14 సంవత్సరాల్లో వాటిని పంపిణీ చేశారు. ఆయా పాఠశాలల్లో మహిళా సైన్సు ఉపాధ్యాయినుల ఆధ్వర్యంలో ఉంచి అవసరమైనప్పుడు విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ, వాటిని వినియోగించేలా చర్యలు తీసుకునేవారు. జిల్లాలో గత కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లాలోని 33 కేజీబీవీల్లో 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలకు నాప్‌కిన్స్‌ను 2014–15లో పంపిణీ చేశారు.
ఎవరికి చెప్పుకోలేక...
కేజీబీవీల్లో చదివే విద్యార్థినుల్లో అత్యధికులు పేద, మధ్య తరగతి వారే అయినందున వారి వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రభుత్వమే శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా శానిటరీ నాప్‌కిన్లు పంపిణీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాల్సి ఉంది. అలా చేస్తే పాఠశాలకు వెళ్లిన సమయంలో నెలసరి వస్తే విద్యార్ధినులకు నాప్‌కిన్లు పాఠశాలలోనే అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ పథకం పాలకుల స్వార్ధానికి బలైపోతుండటంతో విద్యార్ధినులు ఆ సమయంలో ఇళ్లకు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక, ఈ విషయంపై నోరు మెదపలేక బాలికలు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment