అరసవల్లి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడటంతో జిల్లా అధికారులను రాష్ట్ర ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. బుధవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తుండటంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ హెచ్.వై.దొర.. జిల్లా విద్యుత్ శాఖాధికారులతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఎస్‌ఈ దత్తి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వాయుగుండం, తీవ్ర గాలుల వల్ల విద్యుత్ పరంగా అధికంగా దెబ్బతినే ప్రాంతాలు, ముంస్తుచర్యలపై ఆరా తీశారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం, సోంపేట, ఇచ్ఛాపురం, పలాస, కవిటి మండలాల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయని సీఎండీ తెలిపారు. ఆ ప్రాంతాలకు అదనంగా విద్యుత్ స్తంభాలను పంపించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తాయని సంకేతాలు వస్తున్నాయని ఈ తరుణంలో స్తంభాలు పడిపోయే ప్రమాదాలున్నాయని వివరించారు. విద్యుత్ వైర్లపై చెట్లు విరిగిపడే అవకాశాలున్నాయని, ఎక్కడికక్కడ అదనంగా సిబ్బందిని నియమించి, పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం నుంచి విద్యుత్ సిబ్బందికి కచ్చితంగా సెలవులన్నీ రద్దుచేయాలని స్పష్టంచేశారు.
సరిహద్దు తీరప్రాంతాలపై దృష్టి
అనంతరం ఎస్‌ఈ దత్తి సత్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలో వాయుగుండం ప్రభా వంపై సీఎండీ దొరతో పాటు విద్యుత్ శాఖ మంత్రి క్యాం పు కార్యాలయం, కలెక్టర్ ధనుంజయరెడ్డి తదితరులు సూచనలిచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 18 అర్ధరాత్రి నుంచి 19 అర్ధరాత్రి వరకు గాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. అందుకే టెక్కలి డివిజన్‌లో ఒడిశా సరిహద్దు ప్రాంతం, తీరప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. ఇందులో భాగంగా సోంపేట, పలాస సరిహద్దు ప్రాంతాలకు 200 విద్యుత్ స్తంభాలను పంపించామని వెల్లడించారు. తీవ్ర గాలులతో విద్యుత్ నష్టం జరిగిన వెంటనే సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆదేశించామన్నారు. జిల్లాలో టెక్కలి, శ్రీకాకుళం డీఈలు, ఏఈలు, తదితర సిబ్బందితో చర్చించి, ప్రణాళికలు తెలియజేసినట్లు వివరించారు.సిబ్బంది నిర్లక్ష్యంగా పనిచేసినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల జిల్లాలో వర్షాలు, గాలులు వచ్చే ప్రమాదం ఉందని జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం ప్రభావం 18వ తేదీ రాత్రి, 19న (బుధ, గురువారాల్లో) ఎక్కువగా ఉంటుందన్నారు. దక్షిణ ఒడిశా, శ్రీకాకుళం మధ్య తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోందన్నారు. ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. తీరప్రాంతాల మండలాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఒడిశాలో వర్షాల వల్ల వంశధార, నాగావళి నదులకు వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. వర్షాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఈ రెండు నదులు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల వద్ద ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.వరదలు వచ్చినా తట్టుకునేలా ముందస్తు జాగ్రత్తగా ఆహార సామగ్రి సిద్ధం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment