గోదావరి.. ఉధృత ఝురి | Second Danger Warning on Godavari Flow West Godavari | Sakshi
Sakshi News home page

గోదావరి.. ఉధృత ఝురి

Published Tue, Aug 21 2018 1:09 PM | Last Updated on Tue, Aug 21 2018 1:09 PM

Second Danger Warning on Godavari Flow West Godavari - Sakshi

కొవ్వూరులో పాతరైలు వంతెన వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి

పశ్చిమగోదావరి, నిడదవోలు/కొవ్వూరు : గోదావరి కాటన్‌ బ్యారేజీల వద్ద వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం కాస్త శాంతించిన గోదారమ్మ  సోమవారం నుంచి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఎగువ నుంచి గోదావరి నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నా గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టాలు పెరుగుతున్నాయి.

రెండో ప్రమాద హెచ్చరిక
గోదావరి పరివాహక ప్రాంతాలైన కుంట, కొయిదా, పేరూరి, భధ్రాచలం ప్రాంతాలలో కురుస్తున్న భారీవర్షాలతో ప్రాణహిత, శబరి, పెనుగంగ, మంజీర ఉప నదుల నుంచి గోదావరి నదిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరగడంతో «ధవళేశ్వరం హెడ్‌వర్క్స్‌ అధికారులు సోమవారం ఉదయం 11.30 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 13.10 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం రాత్రికి స్పల్పంగా తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు 14.30 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం హెడ్‌ వర్క్స్‌ అధికారులు మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి నీటి మట్టం 15.02 మీటర్లుగా నమోదైంది. కాటన్‌ బ్యారేజీల సామర్థ్యం మేరకు నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తున్నారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం, మద్దూరులంక, బొబ్బర్లంకల వద్ద గోదావరి నదిపై ఉన్న కాటన్‌ బ్యారేజీల గేట్లను పూర్తిగా ఎత్తివేసి సోమవారం సాయంత్రం నాటికి 13.65 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఎగువ ప్రాంతాల్లో పెరుగుతున్న నీటిమట్టాలు
గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమవారం నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. కాళేశ్వరంలో 7.86 మీటర్లు, పేరూరు 12.00 మీటర్లు, దుమ్మగూడెం 12.07 మీటర్లు, భద్రాచలం 45.50 అడుగులు, కూనవరంలో 18.54 మీటర్లు, కుంటలో 13.10 మీటర్లు, రాజమండ్రి బ్రిడ్జి 17.87 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. విజ్జేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద గోదావరి వరద «ఉదృతిని రాష్ట్ర
ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.జవహర్‌ సోమవారం పరిశీలించారు.

వరద ముంపులో గోష్పాదక్షేత్రం
కొవ్వూరులో గోష్పాద క్షేత్రం మళ్లీ వరద ముంపునకు గురైంది. ఆదివారం మధ్యాహ్నానికి వరద ముంపు నుంచి బయటపడినప్పటికీ మళ్లీ ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో సోమవారం ఉదయం రెండోసారి ముంపు బారిన పడింది. సుమారు మూడు అడుగుల మేరకు క్షేత్రంలో నీరు ప్రవహిస్తుంది. వరద ఉధృతి పెరగడంతో క్షేత్రంలోని ఆలయాలను మూసి వేశారు.

భారీ వర్షాలతో మూతపడిన క్వారీలు
భారీవర్షాల నేపథ్యంలో దేవరపల్లి, కొవ్వూరు మండలాల్లో ఉన్న సుమారు 132 క్వారీలు, 150 వరకు క్రషర్లు మూతపడ్డాయి. క్వారీల్లో వర్షపు నీరు చేరడంతో పాటు వాహనాల రాకపోకలకు అనువుగా లేకపోవడం తవ్వకాలు నిలిపివేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement