ఆర్టీసీ బస్సుల్లో సాగుతున్న వానపాముల అక్రమ రవాణా గుట్టును సెక్యూరిటీ అధికారులు రట్టు చేశారు.
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : ఆర్టీసీ బస్సుల్లో సాగుతున్న వానపాముల అక్రమ రవాణా గుట్టును సెక్యూరిటీ అధికారులు రట్టు చేశారు. నాలుగు పెట్టెల్లోని ఎనిమిది సంచుల్లో ఉన్న వానపాములను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖపట్టణం డిపోకి చెందిన గరుడా బస్సు బుధవారం సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ నుంచి బయలుదేరింది.
బస్సు కదిలే సమయంలో ఓ వ్యక్తి వచ్చి వీకే అనే అక్షరాలు రాసివున్న తెల్లని అట్టపెట్టెను డ్రైవర్‌కు అందించాడు. చెన్నై సిటీ దాటిన తర్వాత మరికొందరు వ్యక్తులు అదేవిధంగా మరొక పెట్టెను డ్రైవర్‌కు ఇచ్చారు. అక్కడి నుంచి బస్సు ఆంధప్రదేశ్ సరిహద్దులోకి వచ్చిన తర్వాత భీములవారిపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రం సమీపిస్తున్న తరుణంలో తెల్లని స్కార్పియో వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు బస్సును నిలిపారు. మరో రెండు అట్టపెట్టెలను డ్రైవర్‌కి అందచేశారు. ఈ నాలుగు అట్టపెట్టెలను డ్రైవర్ అత్యంత జాగ్రత్తగా బస్సు కింది భాగంలో ఉండే లగేజ్ బాక్స్‌లో భద్రపరిచాడు. అనంతరం బస్సు బయలుదేరాక తడ చెక్‌పోస్టు దాటే వరకు తెల్లని స్కార్పియో బస్సును వెంబడించింది. చెక్‌పోస్టు దాటాకా ఆ కారు మాయమైంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని బస్సులోని ప్రయాణికులు గమనిస్తున్నారనే విషయాన్ని డ్రైవర్ విస్మరించారు. ఇంతలో నెల్లూరు బస్‌స్టేషన్ అధికారులకు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రముఖ టీవీ రిపోర్టర్‌నని చెన్నై నుంచి వస్తున్న గరుడా బస్సులో వానపాముల అక్రమ రవాణా జరుగుతోందని సమాచారమిచ్చారు. అప్రమత్తమైన ఆర్‌టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డీఎస్పీ లక్కు చెంచిరెడ్డి బస్సు నెల్లూరు బస్‌స్టేషన్‌కు చేరుకోగానే తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు సైతం కోయంబేడు నుంచి తడ చెక్‌పోస్టు వరకు జరిగిన తతంగాన్ని వివరించారు. దీంతో నాలుగు అట్టపెట్టెలను సీజ్ చేసి బస్సులోని ఇద్దరు డ్రైవర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
లక్షల్లో విలువ : స్వాధీనం చేసుకున్న ఒక్కో అట్టపెట్టెలో రెండేసి పాలిథిన్ కవర్లు ఉన్నాయి. ఒక్కో పాలిథిన్ కవర్లో సుమారు 2 కిలోల బరువు గల ఎర్రలు ఉన్నాయి. ఈ లెక్కన నాలుగు అట్టపెట్టెల్లో 16 కిలోల ఎర్రలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. విదేశీ మార్కెట్లో ఎర్రలకు అధికంగా గిరాకీ ఉండడంతో విశాఖపట్టణం మీదుగా విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ వానపాముల విలువ లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. నిత్యం ఇటువంటి పార్శిళ్లు బస్సుల్లో రవాణా చేస్తుంటామని, ఇదంతా స్మగ్లింగ్ అని తమకు తెలియదని కొందరు డ్రైవర్లు విస్తుపోయారు.
గరుడాలో గుట్టుగా..
Published Thu, Dec 26 2013 3:44 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement