ఢిల్లీ పెద్దలకు,జాతీయ మీడియాకు కోటి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఎస్‌ఎంఎస్‌లు
Published Fri, Sep 27 2013 6:15 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం 58వ రోజైన గురువారం కూడా ఉవ్వెత్తున సాగింది. విభజన నిర్ణయూన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి దీక్షల్లో ఉద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలతోపాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఏలూరులో ఎన్జీవోలు గాంధీగిరీ కార్యక్రమం చేపట్టారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు రోడ్లపై పూజా సామగ్రి విక్రయింటారు. వచ్చీపోయేవారి బూట్లకు పాలిష్ చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై ర్యాలీ చేపట్టిన వికలాంగులు ఏలూరు చేరుకున్నారు. వారికి వైఎస్సార్ సీపీ నాయకుడు గుడిదేశి శ్రీనివాస్, టీడీపీ నాయకుడు మా గంటి బాబు స్వాగతం పలికారు.
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అని రాసిన ఎస్‌ఎంఎస్‌లను ఢిల్లీ పెద్దలకు, జాతీయ మీడియూకు పంపించే కార్యక్రమాన్ని ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో చేపట్టారు. తెలంగాణ వాదులకు మంచిబుద్ధిని, రాష్ట్రానికి శాంతిని ప్రసాందించాలని కోరుతూ ఎన్జీవోలు ఏలూరు బుద్ధుని పార్కులో వేడుకున్నారు. భీమవరంలో ఎన్జీవోలు సోనియా, దిగ్విజయ్‌సింగ్, షిండే దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి ప్రకాశం చౌక్‌లో దహనం చేశారు. బీవీరాజు విద్యాసంస్థల ఆధ్వర్యంలో పలువురు కళ్లకు గంతలు కట్టుకుని రిలే దీక్ష చేశారు. ఉపాధ్యాయులు జాతీయ రహదారిని దిగ్బంధించి యోగాసనాలు వేసి నిరసన తెలి పారు. ఉండి సెంటర్లో ఉపాధ్యాయులు, ఎన్జీవోలు అల్లూరి, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ వేషధారణలో మానవహారం నిర్మించి నిరసన తెలి పారు. పాలకోడేరు మండలం విస్సాకోడేరులో భూపతిరాజు రామకృష్ణంరాజు, పి.రాజశేఖర్‌బాబు అనేవారు వేకువజామున 3:15 గంటల నుంచి 36 గంటల దీక్ష చేపట్టారు.
ఆకివీడులో సిద్ధాపురం రైతులు దీక్షలో పాల్గొన్నారు. దీక్షల్లో పాల్గొన్న నాలుగో తరగతి ఉద్యోగులకు దాతల సహకారంతో సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పాలకొల్లు మండలం దిగమర్రులో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. యలమంచిలి మండలం కలగంపూడి వద్ద 214 జాతీయ రహదారిపై జిట్స్ కళాశాల వ్యవసాయ విద్యార్థులు మానవహారం ఏర్పా టు చేశారు. పోడూరులో పాలిటెక్నిక్ విద్యార్థులు రాస్తారోకో చేయగా, రావిపాడులో ఉపాధ్యాయులు పాదయాత్ర చేపట్టారు. ఆచంటలో మేళతాళాలు, బుట్టబొమ్మలతో ర్యాలీ నిర్వహించారు. నరసాపురం బస్టాండ్ సెంటర్‌లో ఉపాధ్యారుునులు రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు. కోర్టు సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు న్యాయశాఖ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్‌లో వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ ఉద్యోగులు వంటావార్పు చేశారు. నాన్ పొలిటికల్ జేఏసీ శిబిరంలో మాజీ మహిళా కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు కూర్చున్నారు. ఉపాధ్యాయులు తాలూకాఫీస్ సెంటర్ నుంచి పోలీస్ ఐలండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొవ్వూరులో గౌతమి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది దీక్షలో చేపట్టారు. జూనియర్ కళాశాల వద్ద ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మవరం, కుమారదేవం, వేములూరు, మలకపల్లి, కొవ్వూరు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. జంగారెడ్డిగూడెంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. బుట్టాయగూడెంలో ఉపాధ్యారుునులు రోడ్లు ఊడ్చి విభజన నిర్ణయంపై నిరసన తెలిపారు. చాగల్లులో వడ్రంగి పనివారు రోడ్డుపైనే వృత్తి పనులు చేసి నిరసన తెలిపారు. ఆర్ అండ్ బీ రోడ్డుపై కోలాటం వేసి వాలీబాల్ ఆడారు.
Advertisement