వద్దన్నా విద్యుదుత్పత్తి! | Seeley specialty hydropower station | Sakshi
Sakshi News home page

వద్దన్నా విద్యుదుత్పత్తి!

Oct 3 2013 3:43 AM | Updated on Sep 1 2017 11:17 PM

రాష్ట్రంలో ప్రసిద్ధ జల విద్యుత్ కేంద్రంగా పేరుపడ్డ సీలేరులో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. అవసరం లేకపోయినా తప్పనిసరిగా విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన విచిత్ర అవస్థ ఎదురవుతోంది.

సీలేరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రసిద్ధ జల విద్యుత్ కేంద్రంగా పేరుపడ్డ సీలేరులో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. అవసరం లేకపోయినా తప్పనిసరిగా విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన విచిత్ర అవస్థ ఎదురవుతోంది. విద్యుత్తు అత్యవసరమైన వేసవిలో సీలేరులో ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేక రాష్ట్రం వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అవసరం లేకపోయినా, విద్యుదుత్పత్తిని పర్యవేక్షించే లోడ్ డిస్పాచ్ విభాగం కోరకపోయినాఉత్పత్తి చేయా ల్సి వస్తోంది. విద్యుత్తు తీసుకోవాలని హైదరాబాద్‌లోని అధి కారులను బతిమాలి మరీ ఉత్పత్తి చేయాల్సి వస్తోంది. సీలేరు రిజర్వాయర్‌లో భారీ పరిమాణంలో నిల్వ ఉన్న నీటిని కాపాడుకోలేని దుస్థితి కారణంగానే ఈ పరిస్థితి ఎదురవుతోంది.
 
గేట్లతో ఇక్కట్లు ః సీలేరు జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్‌ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి, వాడుకునేందుకు వీలుగా 1360 అడుగుల నీటి సామర్ధ్యం గల రిజర్వాయర్ మధ్యలో మినీ రెగ్యులేటర్ డ్యాం ఉంది. దీనికి ఉన్న ఎనిమిది గేట్లు కొన్నేళ్లుగా అవసరమైన సమయాల్లో మొరాయిస్తున్నాయి. హైద రాబాద్‌లోని లోడ్ డిస్పాచ్ సెంటర్ అధికారులు విద్యుత్తు అవసరమైన సమయాల్లో ఫోన్ ద్వారా తెలియజేస్తే, సీలేరులో అధికారులు ఈ మినీ రెగ్యులేటర్ డ్యాం గేట్‌ల ద్వారా నీటిని విడుదల చేయడం పరిపాటి.

అయితే ఈ గేట్‌లు అవసరమైన సమయంలో పైకీ కిందకు దిగకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీలేరు జల విద్యుత్ కేంద్రంలో ఇప్పుడు వి ద్యుదుత్పాదన అవసరం లేదు. దాంతో రిజర్వాయర్ సామర్ధ్యం 1360 అడుగులు కాగా, నీటిమట్టం 1352 అడుగులకు చేరింది. నీటి ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉండడంతో గేట్లు పక్కకు జరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గేట్లను పైకీకిందకీ కదల్చడం ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే గేట్ల వ్యవస్థలో ఉన్న రోలర్‌లు పని చేయకపోవడం వల్ల ఇవి తరచూ మొరాయిస్తున్నాయి.

ఏడేళ్ల కిందట బాగా పనిచేస్తున్న రోలర్‌పరికరాలను మార్చి అధికారులు కొత్తవాటిని అమర్చిన నాటి నుంచి సమస్య మొదలైంది. నీటి ప్రవాహాన్ని నియంత్రించాల్సిన గేట్లు సక్రమంగా పనిచేయక ఇప్పుడు 1,3,4 గేట్‌ల నుంచి రిజర్వాయర్‌లోని నీరు బయటకు వచ్చేస్తోంది. దాంతో దిగువన నీటి మట్టం బాగా పెరిగిపోతోంది. ఇలా వృథాగా నీరు విడుదల  చేయాల్సి వచ్చినప్పుడలా మరోదారి లేక హైదరాబాద్ లోని లోడ్ డిస్పాచ్ విభాగాన్ని బతిమాలి విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గేట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తే ఈ సమస్య ఎదురయ్యేది కాదని నిపుణులు అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement