అటు విభజన పోరు.. ఇటు ఆధిపత్య వార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశం, సీమాంధ్రలో ఉధృతంగా కొనసాగుతున్న ఉద్యమం... ఇవేవీ పట్టని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఆధిపత్యపోరులో ఒకరిపై ఇంకొకరు ఎత్తులు పైఎత్తులతో ముందుకు వెళుతున్నారు. సీమాంధ్రలో అధికారం కోసం ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల మధ్య వార్ తీవ్రమైంది. గత కొద్ది రోజులుగా అంతర్గతంగా సాగుతున్న పోరు ఇప్పుడు బహిరంగ విమర్శలు గుప్పించుకునే స్థాయికి చేరుకుంది. ఈ పోరులో వారు ఏకంగా కులం కార్డును సైతం ప్రయోగిస్తున్నట్టుగా కాంగ్రెస్‌లో చర్చ సాగుతోంది. గత కొద్దిరోజులుగా విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా సమైక్యవాదులు ఉద్యమించడంతోపాటు ఆయన నివాసం, ఆస్తులపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో దీని వెనుక కిరణ్‌కుమార్‌రెడ్డి, లగడపాటి రాజగోపాల్ ప్రమేయం ఉందని బొత్స ఆరోపిస్తున్నారు.
గత కొద్దిరోజులుగా తనతోపాటు తమ సామాజికవర్గ నేతల నివాసాలు, ఆస్తులపైనే దాడులు జరుపుతూ భయభ్రంతాలకు గురిచేసి ఆధిపత్యం సాధించేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా కొందరు సమైక్యవాదులను, ఉద్యోగులను రెచ్చగొట్టి తమ సామాజికవర్గ నేతలపైకి ఉసిగొల్పారని అనుమానిస్తున్నారు. శనివారం బొత్స సత్యనారాయణను గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.బాలరాజు, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కలిసిన సందర్భంగా పై అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కిరణ్, లగడపాటి కలిసే...
తనతోపాటు చిరంజీవి, కన్నా లక్ష్మీనారాయణ, ఇతర కాపు ప్రజాప్రతినిధుల ఇళ్లపై వరుసగా దాడులు చేస్తున్నారని, కిరణ్‌కుమార్‌రెడ్డి, లగడపాటి రాజగోపాల్ కలిసి పథకం ప్రకారమే ఇదంతా చేస్తున్నారనే బొత్స అనుమానాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. తన ఎదుగుదలను జీర్ణించుకోలేక వారిద్దరు ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. అందులో భాగంగానే తనను సీమాంధ్ర ద్రోహిగా చిత్రీకరించడంతోపాటు లేనిపోని దుష్ర్పచారం చేస్తూ ప్రజల్లో చులకన భావం ఏర్పడేలా కుట్ర చేస్తున్నారని వాపోయారు. సమైక్యవాదులే తన ఆస్తులపై దాడికి పాల్పడుతున్నదే నిజమైతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆస్తులపై ఎందుకు దాడికి పాల్పడటం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనినిబట్టి ఏం జరుగుతుందో తేలికగా అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పార్టీ విధానానికే కట్టుబడి ఉంటానని చెప్పినందున తన నివాసంపైనా దాడులు చేస్తున్నారని, తాను గిరిజనుడినైనందునే ఇదంతా జరుగుతోందని బాలరాజు వాపోయినట్లు తెలిసింది. ఇదే అంశాన్ని కన్నబాబు కూడా ప్రస్తావించినట్టు సమాచారం. ఈ విషయంలో సీఎం, లగడపాటి వ్యవహారం, ఏపీఎన్జీవోలను రెచ్చగొడుతూ తమపై దాడులు చేయిస్తున్న అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
బొత్సపై సీఎం వర్గీయుల ఆగ్రహం..
మరోవైపు సీఎం వర్గీయులు బొత్స వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో సీఎం కాలేమనే నిర్ణయానికి వచ్చిన బొత్స రాష్ట్రాన్ని విభజించాలంటూ హైకమాండ్ వద్ద ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల పలుమార్లు చిరంజీవి, బొత్స సహా ఆ సామాజికవర్గ మంత్రులు, ప్రజాప్రతినిధులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నారని ఆరోపిస్తున్నారు. దీంతోపాటు డిప్యూటీ సీఎం, ఆనం రామనారాయణరెడ్డి వంటి వారితో జతకట్టి సీఎంపై హైకమాండ్‌కు లేనిపోని ఫిర్యాదులు చేయిస్తున్నారని చెబుతున్నారు. తాము కూడా బొత్స వ్యవహారంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. లగడపాటి రాజగోపాల్ కూడా తన సన్నిహితుల వద్ద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బొత్సపై దాడి ఆయన స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తొందర్లోనే బొత్స నిజస్వరూపాన్ని బట్టబయలు చే సేందుకు సిద్ధమైన లగడపాటి అందుకోసం తగిన ఆధారాలను సేకరిస్తున్నట్లు సన్నిహితలకు చెప్పారు.