సమైక్యంపై ‘నల్లారి’ నీళ్లు! | kiran kumar reddy trying to back stab over movement of samaikyandhra! | Sakshi
Sakshi News home page

సమైక్యంపై ‘నల్లారి’ నీళ్లు!

Published Mon, Oct 14 2013 1:16 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సమైక్యంపై ‘నల్లారి’ నీళ్లు! - Sakshi

సమైక్యంపై ‘నల్లారి’ నీళ్లు!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఉధృతంగా సాగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చడం ద్వారా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును గట్టెక్కించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పావులు కదుపుతున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నవంబర్ మొదటివారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రతిపాదించే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయని చెబుతున్నారు. ‘సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందే రాజకీయ సంక్షోభం సృష్టించే అవకాశం ఉన్నా ఆ పని చేయకపోగా.. స్వయంగా రాజీనామాలకు ముందుకు వచ్చిన పార్టీ నేతలను కూడా ఆయన వారిం చారు.
 
 అప్పుడే ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది..’ అని సొంతపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్న ఉద్యోగ సంఘాలను అసెంబ్లీలో తీర్మానం పేరుతో మభ్యపెడుతూ.. ఉద్యమతీవ్రత మరింత పెరగాల్సిన సమయంలో వారు ఆందోళనలు విరమించేలా చేయడం ద్వారా సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముందే తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఉద్యమాల్లో పాల్గొన్నారు. సీమాంధ్ర జేఏసీ పిలుపు మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా తమ పదవులు వదులుకున్నారు. దీక్షలు సైతం చేశారు.   
 
 వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేతలు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.  ఉధృతంగా సాగుతున్న ఉద్యమాన్ని.. మరో నెలరోజుల పాటు అదేవిధంగా కొనసాగిస్తే విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో విభజన బిల్లును అడ్డుకోగలిగితే ఆ తర్వాత బిల్లు గట్టెక్కడం అంత సులభం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. 2014 సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగితే.. ఆ తర్వాత ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, పరిస్థితులు ఎలా మారతాయో.. ఆ పరిణామాలను బట్టి నిర్ణయాలకు అవకాశం ఉంటుందని వారంటున్నారు.
 
 ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ ఫలితమే... విభజన ప్రక్రియలో జాప్యం
 
 జూలై 30న సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన నిర్ణయం వెలువరించిన వెంటనే సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. చిన్నా, పెద్దా, మహిళలు అన్న తేడా లేకుండా 13 జిల్లాల్లో కోట్లాది మంది రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆ తరువాత కొద్దిరోజులకే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు కూడా తోడు కావడంతో సీమాంధ్ర పూర్తిగా స్తంభించిపోయింది. ఈ కారణంగానే కేంద్రం ఆ తరువాత రెండు మాసాల పాటు రాష్ట్ర విభజన ప్రక్రియ జోలికే పోలేదు. తెలంగాణ ప్రాంత నేతలను మెప్పించడం కోసం అడపాదడపా ప్రకటనలకే కాంగ్రెస్ హైకమాండ్ పరిమితమైంది. ఇక విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఉద్యమం మహోధృతమైంది. వారి ఆందోళనలు కేంద్రంలో సైతం కదలిక తెప్పించింది.
 
 ఉద్యమ తీవ్రతను గుర్తించే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు ఆందోళనలు విరమించే యోచనలో ఉన్నారని తనకు సమాచారం ఉందని కూడా ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సమయంలోనే జీతాలు లేక ఆకలితో అలమటిస్తూ కూడా నిజాయితీగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఉద్యోగులను మభ్యపెట్టే కార్యక్రమానికి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉద్యోగులతో చర్చలు జరిపారు. ఎన్జీవోలు విరమణకు సమయం కోరినా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు మూడురోజుల వ్యవధిలోనే సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన తీర్మానాన్ని ఆమోదించి విధివిధానాల కోసం మంత్రుల బృందాన్ని (జీవోఎం) సైతం ఏర్పాటు చేసింది.
 
 హైకమాండ్ కుట్రలో భాగమే...
 
 జీవోఎంను నియమించిన నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి ఉండగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలను మభ్యపెట్టి వారిని ఉద్యమం నుంచి బయటకు తెచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించడం కచ్చితంగా హైకమాండ్ కుట్రలో భాగమేనన్నది మెజారిటీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అభిప్రాయంగా ఉంది. గడచిన రెండు మాసాలుగా సాగుతున్న ప్రజా ఉద్యమానికి రాజకీయ సంక్షోభం కూడా తోడయితే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు గట్టెక్కడం అంత తేలికైన పని కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కానీ ఇలాంటి కీలక సమయంలో ఒక్కటొక్కటిగా ఉద్యోగ సంఘాలతో.. మరీ ముఖ్యంగా ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఉద్యమాన్ని ముఖ్యమంత్రి విరమింపజేశారంటే.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర విభజన బిల్లును ప్రతిపాదించేందుకు మార్గం సుగమం చేయడమేనని పరిశీలకులంటున్నారు.
 
 అలాకాకుండా పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యేదాకా ప్రజా ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తూ రాజకీయ సంక్షోభం కూడా సృష్టించినట్లైతే రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు వెళ్లకుండా తప్పకుండా మందగించేదని వారు విశ్లేషిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాను సమైక్యవాదినని ప్రచారం చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారే తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఏ ఒక్క ప్రయత్నమూ చేయలేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ‘కుర్చీని కాపాడుకోవడం, సమైక్యవాదినని ముద్ర వేసుకునే ప్రయత్నాలు చేయడం, మధ్యలో కాంగ్రెస్ హైకమాండ్ డెరైక్షన్‌నూ తు.చ. తప్పకుండా అమలు చేయడం ఇదే కిరణ్ ఆచరిస్తున్నది’ అని ఓ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
 
 కిరణ్ వైఖరి ఆదినుంచీ అనుమానాస్పదమే...
 
 రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరి ఆది నుంచీ అనుమానాస్పదంగానే ఉందని ఆయన మంత్రివర్గ సహచరులే మండిపడుతున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానించినప్పుడే రాజీనామాలు చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదని వారి అభిప్రాయం. ‘సీడబ్ల్యూసీ తీర్మానం చేసినా తర్వాత కేంద్ర మంత్రివర్గం విభజనకు ఓకే చెప్పినా.. ముఖ్యమంత్రి మాత్రం అసెంబ్లీ తీర్మానమంటూ మభ్యపెడుతూ వచ్చారు. కేంద్ర కేబినెట్ తీర్మానం అసెంబ్లీకి రాదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేస్తే గానీ కిరణ్ డ్రామాలు మాకు అర్థం కాలేదు’ అని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధపడినప్పుడు సీఎం వారిని గట్టిగా వారించారు. అసెంబ్లీలో తీర్మానం అడ్డుకుంటామని చెబుతూ దాదాపు రెండున్నర నెలలుగా సాగిన ఉద్యమం ఏ స్థాయిలోనూ రాజకీయ రూపం దాల్చకుండా అడ్డుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం అడ్డుకుంటామని ఉద్యోగులతో పాటు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను మభ్యపెడుతూ ఉద్యమం తీవ్రరూపం దాల్చకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు..’ అని విశ్లేషకులు అంటున్నారు.
 
 ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ
 
 సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం తీసుకోవడానికి ముందు నుంచీ సమైక్య నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుస ఆందోళనలు చేస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. జగన్ రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష చేయగా విజయమ్మ కూడా నిరాహార దీక్ష చేశారు. సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో ఒకేసారి పార్టీ నేతలు దీక్షలు చేపట్టడం వంటి ఎన్నో నిరసన కార్యక్రమాలు వైఎస్సార్‌సీపీ చేపట్టింది. అలాగే సమైక్య నినాదాన్ని పెద్దఎత్తున చాటేందుకు ఈ నెల 19న హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ తరుణంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వస్తే పెద్ద సంక్షోభమే ఏర్పడేది. అయితే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ దాగుడుమూతలాడుతూ తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేశాయి.
 
 ఉద్యమానికి రాజకీయ బలం చేకూరకుండా ఆ రెండు పార్టీలు అడ్డుకట్ట వేశాయి. ఇక అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామాలు చేయకుండా, మరోవైపు ఉద్యమం రాజకీయ మలుపు తిరగకుండా సమైక్యాంధ్రకు అత్యంత కీలకమైన రెండున్నర నెలల కాలాన్ని సీఎం వృథా చేశారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అసెంబ్లీని ముందుగానే సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ముందుగానే తీర్మానం చేసి పంపిద్దామంటూ వైఎస్సార్ సీపీ చేసిన ప్రతిపాదనను వ్యక్తిగత ప్రతిష్టకు పోయి పక్కకు పెట్టారు. కేవలం రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసమే తెలంగాణ బిల్లును పంపిస్తామని షిండే (ఈయన జీఓఎంలో కూడా సభ్యుడే) స్పష్టంగా చెబుతున్న తర్వాత కూడా తీర్మానాన్ని అడ్డుకుంటామంటూ సొంత పార్టీ నేతలను సైతం సీఎం ఏమార్చుతున్న తీరు రాజకీయ పరిశీలకులకే విస్మయం కలిగిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement