సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తారా.. లేదా అన్నది పెద్ద బ్రహ్మ పదార్థంగా మారిపోయింది.
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తారా.. లేదా అన్నది పెద్ద బ్రహ్మ పదార్థంగా మారిపోయింది. వాస్తవానికి ఈరోజు (మంగళవారం) ఉదయమే స్పీకర్ మీరాకుమార్ను ఏడుగురు ఎంపీలు కలవాల్సి ఉంది. ఆమె వారికి ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. వీరంతా తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్కు గతంలోనే లేఖలు రాశారు.
అయితే.. వారిలో కొంతమంది మళ్లీ వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మెజారిటీ ఎంపీలు రాజీనామాలకు వ్యతిరేకంగానే ఉన్నారని, ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించిన తర్వాతే రాజీనామాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. రాజీనామాలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, ఎంపీలుగా కొనసాగితేనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును వ్యతిరేకించవచ్చని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చూస్తే.. మళ్లీ ఎంపీలు వెనకడుగు వేసినట్లే కనిపిస్తోంది.