ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు చేపట్టిన 48 గంటల సమ్మె ప్రభావం జిల్లాపై పడింది. జిల్లా వ్యాప్తంగా వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది. జిల్లాకు వచ్చే విద్యుత్ సరఫరా అంతకంతకూ పడిపోతుండడంతో కరెంట్ కోతలు మరింత పెరిగే అవకాశం ఉందని, మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ పరిస్థితి...
టీ-నోట్‌కు కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే ఎన్‌జీఓలతో పాటు, విద్యుత్ ఉద్యోగులు 48 గంటల సమ్మెలోకి వెళ్లారు. శుక్రవారం నుంచి ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఇది ప్రత్యక్షంగా విద్యుత్ ఉత్పత్తిపై పడింది. రెండు రోజుల నుంచి విద్యుత్ ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. విజయవాడలోని వీటీపీఎస్, పొద్దుటూరులోని ఆర్‌టీపీపీ ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జిల్లాకు వచ్చే విద్యుత్ సరఫరాలో అధికారులు కోత విధించారు.
జిల్లాకు రోజూ దాదాపు 350 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. వీటీపీఎస్, ఆర్టీపీఎస్ నుంచి వచ్చే లైన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శ్రీశైలం జల విద్యుత్ ప్లాంట్ నుంచి ప్రస్తుతం జిల్లాకు విద్యుత్ అందిస్తున్నారు. అయినా 280 నుంచి 300 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతోంది. సరఫరా ఇంకా తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. పై నుంచే విద్యుత్ సరఫరా లేకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల నెలకొన్న సాంకేతిక లోపాలను సవరించేందుకు కూడా ఉద్యోగులు అంగీకరించడం లేదు.
రెండు రోజులపాటు కోతలే..
విద్యుత్ సరఫరా లోటుతో ఇప్పటికే రెండు రోజుల నుంచి తీవ్ర కరెంట్ కోతలతో అల్లాడుతున్న జిల్లా వాసులకు మరో రెండు రోజులు కోతలు తప్పవని అధికారులు చెబున్నారు. నేటి నుంచి ఉద్యోగులు విధులకు హాజరైనా విద్యుదుత్పత్తిని పునరుద్ధరించేందుకు కనీసం రెండు రోజులు పడుతుందని చెప్తున్నారు. అంటే జిల్లాకు మరో రెండు రోజుల పాటు విద్యుత్ కోతలు తప్పవన్నమాట. ఒంగోలు కార్పొరేషన్‌ను మినహాయిస్తే మిగిలిన చోట్ల అధికారులు భారీగా కోతలు విధిస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలో ఇది మరింత దారుణంగా ఉంది. యర్రగొండపాలెం, తర్లుపాడు, త్రిపురాంతకం, కొమరోలు, కంభం, మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి, మార్టూరు తదితర ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోత విధించారు. అలాగే మున్సిపల్ కేంద్రాల్లోనూ దాదాపు నాలుగు గంటల పైనే కోత పెట్టారు. గ్రామాల్లో అయితే శుక్రవారం రాత్రి పోయిన కరెంట్ శనివారం మధ్యాహ్నం వరకు రాలేదు. ప్రస్తుతం ఇంకా కొన్ని గ్రామాల్లో కరెంట్ పునరుద్ధరించలేని పరిస్థితి ఉంది.
మంచినీటికీ ఇబ్బందే...
విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వర్షాకాలం కావడంతో రాత్రిపూట కరెంట్ లేక కనీసం నిద్ర కూడా పోలేకపోతున్నారు. దోమలతో రాత్రంతా యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అలాగే అత్యవసరమైన మంచినీటికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కరెంట్ లేక మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో నీటి సరఫరాకు తీవ్ర ఆటంకంగా మారింది.
సరఫరా లోటు వల్లే కోతలు ఎస్‌ఈ జయభారతిరావు
జిల్లాకు వచ్చే విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల విద్యుత్ కోతలు తప్పడం లేదు. కొన్నిచోట్ల అధికంగానే కోతలు విధిస్తున్నాం. కార్పొరేషన్, మున్సిపల్ కేంద్రాలకు కరెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మరో రెండు రోజుల వరకు కోతలు తప్పకపోవచ్చు.
ప్రకాశం అంధకారం
Published Sun, Oct 6 2013 4:54 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement