
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె రాజ్యాంగ వ్యతిరేకం: కోదండరాం
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె రాజ్యాంగ వ్యతిరేకమని టీ. జేఏసీ కన్వీనర్ ప్రొ. కోదండరాం మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు.
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె రాజ్యాంగ వ్యతిరేకమని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు. వారి చర్యలు అధర్మమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇస్తామన్నారు.
రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 16 నుంచి తెలంగాణ ప్రాంతంలో జేఏసీ ఆధ్వర్యంలో శాంతిర్యాలీలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. అలాగే ఈ నెలాఖరులో రాజధాని హైదరాబాద్లో భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంతం వెనకబాటుకు సీమాంధ్ర మంత్రులే కారణమని కోదండరాం ఈ సందర్భంగా ఆరోపించారు. ఆ విషయంలో సీమాంధ్ర మంత్రులను వారి భార్యలే నిలదీయాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలు గవర్నర్ నరసింహన్ ను కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.