ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం
ఐకేపీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి
Published Mon, Oct 21 2013 3:51 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. ఆదివారం స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఐకేపీ ఉద్యోగుల భవిష్యత్‌పై సీమాంధ్ర జిల్లాల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే ఐకేపీ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండాలని, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఐదుగురు సభ్యులతో అడ్‌హక్ కమిటీని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో పర్యటించే కేంద్ర బృందానికి తమ సమస్యలను వివరిస్తామన్నారు. రాష్ట్ర గవర్నర్ రెండు రోజుల్లో ఢిల్లీ వెళుతున్నారని, ఆయన్ని కలిసి ఐకేపీ ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేస్తామన్నారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అధిక శాతం ఐకేపీ ఉద్యోగుల ద్వారా ప్రజల దరి చేరుతున్నాయన్నారు. ఉద్యోగుల సమస్యలను అనేక పర్యాయాలు ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిషత్ కార్యాచరణ ప్రణాళికపై వారం రోజుల్లోగా తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే నెల 3న విజయవాడలో సీమాంధ్ర ఐకేపీ ఉద్యోగుల సభ భారీ స్థాయిలో నిర్వహించనున్నామని వెల్లడించారు.
సమైక్యాంధ్ర సాధన కోసం ఏపీ ఎన్‌జీఓలు చేపట్టే ఉద్యమాల్లో పాల్గొంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఆదినారాయణ, చిన్నయ్య, కృష్ణ య్య, వెంకట్రావు, సతీష్, శ్రీధర్, సీమాంధ్ర జిల్లాల నాయకలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ఐకేపీ ఉద్యోగుల అడ్‌హక్ కమిటీని ఎంపిక చేశారు. రత్నకర్ (వైజాగ్), మురళి (శ్రీకాకుళం), రామకృష్ణ(విజయవాడ), వెంకట్రావు(నెల్లూరు), కుమార్(నెల్లూరు) అడ్‌హక్ కమిటీ సభ్యులుగా ఉంటారన్నారు.
Advertisement
Advertisement