ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి నెలాఖరువరకు మూసివేస్తామని ఆంధ్రప్రదేశ్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏపీయూఎస్‌ఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు జనార్దనరెడ్డి చెప్పారు.
సాక్షి నెట్‌వర్క్: సెలవుల్లేవ్.. విరామం లేదు.. విశ్రాంతి లేదు.. ఒక్కటే లక్ష్యం సమైక్యాంధ్ర కొనసాగించడం... సీమాంధ్ర జిల్లాల్లో అవిశ్రాంతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం వరుసగా 54వరోజూ ఆదివారం ఉవ్వెత్తున ఎగసింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, వినూత్న నిరసన ప్రదర్శనలతో సమైక్యవాదులు హోరెత్తించారు. విశాఖలో సిక్కులు ై మానవహారం ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో దేవాంగులు విజయనగరం-పాలకొండ రహదారిలో ర్యాలీ చేపట్టి నడిరోడ్డుపైనే వస్త్రాలు నేశారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరక బస్సుయాత్ర చేపట్టారు. నరసన్నపేటలో మెయిన్ రోడ్డును దిగ్బంధించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సుమారు రెండువేల మంది కొబ్బరి వర్తకులు, ఒలుపు, ఎగుమతి, దిగుమతి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ట గోదావరి వలందరరేవులో మహిళలు జలదీక్ష చేశారు.
తిరుపతిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిం చారు. బికొత్తకోటలో గాడిదలకు కేంద్రమంత్రుల ఫొటో మాస్క్‌లు తగిలించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఏకగీవ్రంగా తీర్మానాలు చేసి పంపారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో వేలాది మంది ఐకేపీ మహిళలు 54ఆకారంలో కూర్చొని నిరసనను తెలిపారు. కర్నూలులో ఎ.క్యాంప్‌లోని కాలనీవాసులు ప్రధాన కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు.
గుంటూరు జిల్లాలోని కుంచనపల్లి గ్రామం నుంచి వచ్చిన రైతులు విజయవాడ బందరురోడ్డులో ఎడ్లబళ్ల ప్రదర్శన చేశారు. సమైక్యవాదులపై ఎంపీ లగడపాటి వర్గీయులు చేసిన దాడికి నిరసనగా విజయవాడలో ఆటోనగర్ బంద్ నిర్వహించారు. గంటూరు జిల్లా మాచర్ల, దుర్గిలో క్రెస్తవులు రోడ్డుపై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెనాలిలో దున్నపోతుకు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణా ప్లెక్సీలను ఏర్పాటు చేసి చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతాన్ని ఎండగడుతూ ప్రదర్శన చేపట్టారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎన్జీవో, ఆర్టీసీ జేఏసీ నాయకులు ర్యాలీ, బస్టాండ్ ఎదురుగా రాష్ట్రీయ రహదారిపై మానవహారం నిర్వహించారు.
నేటినుంచి ప్రైవేటు పాఠశాలల బంద్
విజయవాడ: ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి నెలాఖరువరకు మూసివేస్తామని ఆంధ్రప్రదేశ్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏపీయూఎస్‌ఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు జనార్దనరెడ్డి చెప్పారు. విజయవాడలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఈనెల 23, 24, 25 తేదీల్లో బంద్‌తో పాటు విద్యార్థులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. 26న అన్ని పట్టణాల్లో మానవహారం, 27న సైకిల్ యాత్రలు, 28న బాటమీద బడి నిర్వహి స్తామని వివరించారు. 29న కర్నూలులోఎన్జీవోలు నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను విజయవంతం చేస్తామని చెప్పారు. 30న తిరిగి బాటమీద ఆట, అక్టోబర్ ఒకటిన అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో గాంధీజీ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణవంటి కార్యక్రమాలు చేపడతామన్నారు.
రఘువీరాకు సొంతూరులో సెగ
సాక్షి నెట్‌వర్క్: రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి సొంతూరులోనే సమైక్య సెగ తాకింది. ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సమైక్యవాదులు ఆయన ఇంటిని ముట్టడించారు మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని పట్టుబట్టారు.
అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించడానికే పదవులకు రాజీనామా చేయడం లేదని రఘువీరా చెప్పిన వారు సంతృప్తి చెందలేదు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్నవారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన టీడీపీ నేత కళా వెంకటరావును, తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును ఉద్యోగులు అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమైక్యవాదులు ఎమ్మెల్యే ఉషారాణి ఇంటిని ముట్టడించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.