బుగ్గకారు.. వదులుకోరు!
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తమ పదవులకు మంత్రులు చేసిన రాజీనామాలన్నీ ఒట్టి డ్రామానేనని స్పష్టమవుతోంది. రాజీనామాలు చేశామని పైకి ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నా.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. రాజీనామాలు చేసిన మంత్రులంతా అధికార దర్పాన్నే ఒలకబోస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. అధికారిక సమీక్షలు, ఫైళ్లపై సంతకాలు యథావిధిగా సాగిపోతున్నాయి. అధికారిక నివాసాలను వదల్లేదు.. ప్రభుత్వం సమకూరుస్తున్న మందీమార్బలాన్నీ వెనక్కు పంపలేదు.. బుగ్గ కార్లను అసలే వదలడం లేదు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో జరిగిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రుల సమావేశంలో రాజీనామాలపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, మహీధర్‌రెడ్డి, విశ్వరూప్, తోట నర్సింహం, కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు, సి.రామచంద్రయ్య తదితరులు సీఎంకు రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలు చేసినందున వారంతా పదవులకు దూరంగా ఉండాలి. కానీ అలా ఏ ఒక్కరూ కనిపించడం లేదు. తాము రాజీనామాలు చేసినా సీఎం ఆమోదించలేదు కనుక అప్పటివరకు తాము మంత్రులమే అని చెబుతున్నారు.
చిత్తశుద్ధితో రాజీనామాలు చేసి ఉంటే నైతికంగా వాటికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మంత్రులకు ఉంటుందనీ, కానీ మంత్రులు మాత్రం సీఎం ఆమోదించలేదు కనుక తాము మంత్రులమేనన్నట్లుగా అధికారిక కార్యక్రమాల ను యథావిధిగానే కొనసాగిస్తుండటంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి మంత్రిగా అధికారిక హోదాలో పర్యటనలు సాగించడంతో పాటు మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాలూ కొనసాగిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుదీ ఇదే తీరు. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా ఆయన అధికారిక హోదాలో పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల విశాఖలోని పలు కార్యక్రమాల్లో ఆయన మంత్రి హోదాలోనే భాగస్వాములయ్యారు. ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ కర్నూలు జిల్లాలో చేసే పర్యటనల్లో, రాజధానిలో జరిగే కార్యక్రమాల్లో అధికారిక హోదాల్లోనే పాల్గొంటున్నారు. కొంతమంది మంత్రులు సచివాలయంలోని తమ కార్యాలయాలకూ హాజరవుతున్నారు. మరికొందరు మంత్రులు సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ నిరసనలకు భయపడి రావడం లేదు. కానీ తమ నివాసాలకే అధికారులను పిలిపించుకుని.. ఫైళ్లను తెప్పించుకుని సమీక్షలు నిర్వహిస్తునట్నారు. ఉద్యోగులు సమ్మెలో ఉన్నా అధికారులతోనే ఫైళ్లను రూపొందించి మరీ సంతకాలు చేస్తున్నారని తెలుస్తోంది.
వారు అలా.. వీరు ఇలా..
మంత్రుల తీరు చూసి సమ్మెలో ఉన్న సీమాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు తాము ఏ త్యాగానికైనా సిద్ధమని, ప్రాణాలైనా అర్పిస్తామని ప్రకటనలు చేసిన మంత్రులు ఇప్పుడు కనీసం వారి రాజీనామా లేఖలకు కూడా కట్టుబడటం లేదని మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు సమర్పించిన సమయంలో టీ-మంత్రులు సైతం రాజీనామాలు చేశారు. అయితే ఆ సమయంలో వారెవరూ సచివాలయం ముఖం కూడా చూడలేదు. సీఎం నిర్వహించిన అధికారిక సమీక్షలకు కూడా దూరంగా ఉన్నారు. చివరకు సీఎం కేబినెట్ సమావేశాన్ని తన నివాసంలో పెట్టుకోవాల్సి వచ్చింది. సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేసినా సచివాలయంలో సమావేశాలు, జిల్లాల్లో అధికారిక కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తున్నారు. సమైక్యవాదం పట్ల గానీ, సీమాంధ్ర ప్రయోజనాల పట్ల గానీ సీమాంధ్ర మంత్రులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, అంతా డ్రామాలు ఆడుతూ మభ్యపెట్టడానికే వారు చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.