హైదరాబాద్: సీమాంధ్ర కేంద్ర మంత్రుల వాయిస్ పూర్తిగా మారిపోయింది. కొంతమంది విభజనకు సిద్ధపడి ప్యాకేజీల విషయం మాట్లాడుతుంటే, మరికొంతమంది విభజనను అడ్డుకోగలం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు చెన్నైలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ తామెంత మొరపెట్టినా అధిష్టానం వినలేదని చెప్పారు. విభజన తప్పదన్న దృఢనిశ్చయంతో అధిష్టానం ఉందన్నారు. కానీ, విభజనను అడ్డుకోగలమనే నమ్మకం తమకు ఉందని చెప్పారు.
కేంద్ర మంత్రి పురందేశ్వరి బంజారాహిల్స్లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యలను పరిష్కరించకుంటే విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వస్తుందన్నారు. విభజన అనివార్యమని తెలియటంతో తాము సీమాంధ్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టామన్నారు.
మరో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళంలో మాట్లాడుతూ విభజన అనివార్యం అన్నారు. సీమాంధ్ర ప్యాకేజి కోసం డిమాండ్ చేస్తామని చెప్పారు.