
హైదరాబాద్ నుంచే ఆంధ్రప్రదేశ్ పాలన!: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు విశ్రమించననీ, తాను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని అయినా హైదరాబాద్‌ను వదలనని, ఇక్కడ్నుంచే పాలన సాగిస్తానని చంద్రబాబునాయుుడు స్పష్టంచేశారు. వారంలో ఒకరోజు తెలంగాణ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తానని టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగింది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలతోపాటు ఓడిపోయిన అభ్యర్థులు, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరైన ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ బలమైన రాజకీయ శక్తి అనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయని, 2019 నాటికి అధికారంలోకి రావడమే కర్తవ్యమని చెప్పారు.
తెలుగుదేశం పాలన వల్లే తెలంగాణ ఈరోజు మిగులు బడ్జెట్‌లో ఉందని, అభివృద్ధి కార్యక్రమాల్లో హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టిన ఘనత టీడీపీదేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ మునిగిపోయిందని, ఇక కోలుకునే అవకాశమే లేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ లపై ఆశలు పెట్టుకున్నా... అంతర్గత విభేదాల కారణంగా ఓటమిపాలయ్యామని, భవిష్యత్తులో నేతలంతా కలసి కట్టుగా పనిచేయాలని సూచించారు.
తెలంగాణ టీడీపీ సార థులు ఎల్.రమణ, ఆర్.కృష్ణయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎంపీ టి.దేవేందర్ గౌడ్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎ.రేవంత్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సాయన్న, ప్రకాశ్ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, ధర్మారెడ్డి, ఇతర నాయకులు కె. అరవింద్‌కుమార్ గౌడ్, పి. రాములు, సీతాదయాకర్ రెడ్డి, లక్ష్మీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.