- విభజనపై నివేదించనున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు
- భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలి
- నేడు జీవోఎంతో భేటీ.. భారీ ప్యాకేజీలపైనే దృష్టి
- భేటీకి ముందు పళ్లంరాజు నివాసంలో సమావేశం
- సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణానికయ్యే వ్యయాన్ని కేంద్రం భరించాలి. అక్కడ ఏర్పాటయ్యే పారిశ్రామిక, ఐటీ హబ్‌ల విషయంలో తగిన ఆర్థిక సాయం చేయాలి. కనీసం దశాబ్ద కాలం పాటు రాయితీలు కూడా అందించాలి.
- ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల బాధ్యతను కేంద్రానికి అప్పగించాలి.
- భద్రాచలాన్ని సీమాంధ్రలో విలీనం చేయాలి.
- కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థల ఏర్పాటు.
- వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీటి వసతుల కల్పనకు కేంద్రం తగిన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి.
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజనను అడ్డుకోవడం అనే ఎజెండాకు స్వస్తి పలికిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు.. ఆంధ్ర రాష్ట్రానికి ప్యాకేజీల డిమాండ్లపై దృష్టి సారించారు. ప్రధానంగా హైదరాబాద్, సాగునీటి వనరుల పంపకం, నూతన రాజధాని అభివృద్ధికి తగిన ఆర్థిక ప్యాకేజీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు వంటి అంశాలను.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ముందు ఉంచాలని భావిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ విషయంలో సీమాంధ్రుల్లో నెలకొన్న భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎండీఏ పరిధి మేరకు హైదరాబాద్‌ను ఢిల్లీ, పుదుచ్చేరి తరహాలో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని.. అలాచేస్తే విభజనకు అభ్యంతరం లేదని జీవోఎంకు నివేదించాలని యోచిస్తున్నారు.
సోమవారం ఉదయం సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎం ఎదుట హాజరుకావాల్సిన నేపథ్యంలో.. దానికి ముందుగా కేంద్రమంత్రి పళ్లంరాజు నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులతో పాటు అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి, జె.డి.శీలం తదితరులు విభజన అనివార్యమైందని, విడిపోతే సీమాంధ్ర ప్రజలకు కావాల్సిన అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళతామని చెప్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం జీవోఎం ఎదుట సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఉంచే డిమాండ్లు ఇలా ఉన్నాయని సమాచారం...