షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయడం వీళ్లకు మామూలే: వైఎస్ జగన్
సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను నష్టాల్లోకి తీసేసి.. వాటిని సొంత మనుషులకు అమ్మేయడం ఈ ప్రభుత్వానికి మామూలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హుదూద్ తుఫాను బారిన పడిన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతాన్ని ఆయన శనివారం సందర్శించి, అక్కడి వారిని పరామర్శించారు. తుఫాను సాయం ఎలా అందుతోందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి చెరుకు రైతులు తమ గోడును వైఎస్ జగన్ వద్ద వెళ్లబోసుకున్నారు.
తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులకు 6 కోట్ల రూపాయలు బకాయి పడితే ఇప్పటికి కేవలం 3 కోట్లే ఇచ్చారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏడు నెలల నుంచి కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో కూడా 4 కోట్ల రూపాయలకు ఈ ఫ్యాక్టరీని అమ్మేయడానికి ప్రయత్నాలు చేయగా, అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు.