ఏమవుతుందో..!
రేపు తేలనున్న తుమ్మపాల సుగర్స్ భవితవ్యం
సహకార కర్మాగారాలకు గడ్డుకాలమని ఐఏఎస్ అధికారి నివేదిక...?
{పభుత్వ గ్యారెంటీ ఇస్తే రుణాలిస్తామన్న ఆప్కాబ్
అనకాపల్లి : తుమ్మపాల చక్కెర కర్మాగార భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సహకార రంగానికి గడ్డుకాలం ఉందని, ప్రధానంగా చక్కెర పరిశ్రమ జాతీయస్థాయిలో ఆర్థికంగా కుదేలవుతున్నందున సహకార రంగంలో కొనసాగుతున్న కర్మాగారాలకు తగిన సహకారం అందించినా నష్టాలే పునరావృతమవుతాయని ఓ ఐఏఎస్ అధికారి ఇవ్వనున్న నివేదిక దీనిపై తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ర్టంలో సహకార రంగంలో ఉన్న 11 చక్కెర కర్మాగారాల్లో ఇప్పటికే ఐదు మూతపడగా తాజాగా తుమ్మపాల చక్కెర కర్మాగారం అదే బాటలో పయనిస్తోంది. రూ.కోట్ల అప్పులు, నష్టాలతో కుదేలైన తుమ్మపాల చక్కెర కర్మాగారానికి ఈ సీజన్‌కు సంబంధించి రుణాలు ఇవ్వాలంటే ప్రభుత్వం గ్యారంటీ తప్పనిసరి అని ఆప్కాబ్ చెప్పి తప్పించుకుంది.
వ్యాట్ మినహాయింపునకు నిర్ణయం
బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వ్యాట్ నుంచి చక్కెర కర్మాగారాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారే తప్ప సంక్లిష్ట స్థితిలో ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారం గురించి చర్చించిన దాఖలాలు లేవు. ఈనెల 19న చక్కెర కర్మాగారాలపై ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. ఈ సబ్ కమిటీకి కర్మాగారాల గురించి ఒక ఐఏఎస్ అధికారి సమర్పించనున్న నివేదికే కీలకం కానున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాలకు వెయ్యి కోట్ల నిధులు కేటాయించినా ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నుంచి చక్కెర పరిశ్రమలు బయటపడడం కష్టమని ఆయన పేర్కొంటున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో సహకార చక్కెర కర్మాగారాలకు రుణాలు అందించలేమని ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్థిక పరపతి లేని కర్మాగారాల్లో ఒకటైన తుమ్మపాల కర్మాగారానికి ఆప్కాబ్ నిధులు ఇవ్వడం కష్టమని, ఫలితంగా కర్మాగారంలో క్రషింగ్‌కు దారులు మూసుకుపోతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోవడం, చెరకు రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకోకపోవడం, ఉన్న చెరకు ఏటికొప్పాక, తదితర కర్మాగారాలకు తరలిపోవడానికి అవకాశాలు పెరగడంతో ఇక ఈ ఏడాది క్రషింగ్ ఆశలు సన్నగిల్లినట్లేనని మరికొందరు పేర్కొంటున్నారు.
అంధకారంలో కర్మాగారం...
తుమ్మపాల చక్కెర కర్మాగారం ఆర్థిక వెతలు ఒక్కొక్కటికి బయటపడుతుండగా తాజాగా కర్మాగారం విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.సుమారు రూ.40 లక్షల వరకూ కర్మాగారం బకాయి పడినట్లు తెలుస్తోంది.
ఎండీకి అనారోగ్యం...
తుమ్మపాల చక్కెర కర్మాగారం ఎండీ సత్యప్రకాష్ గతకొద్దిరోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కర్మాగార స్థితిగతులు దిగజారిన సమయంలోనే ఎండీ అనారోగ్యానికి గురి కావడంతో మార్కెట్‌వర్గాలు మరింత డీలా పడ్డాయి.
ఆప్కాబ్‌పై ఆశలు పెట్టుకోగా ఆప్కాబ్ అధికారులు ప్రభుత్వం వైపు బంతిని నెట్టేసి కర్మాగార భవితవ్యాన్ని మరింత జటిలం చేశారు.
జీతాలు లేక ఇబ్బందులు
గత 16 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నాం. ఇంటి పోషణ సైతం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు జీతాలు అందేలా సహకరించాలి. - డి.పైడిరాజు, రెగ్యులర్ ఉద్యోగి
ఫ్యాక్టరీకోసం పనిచేస్తున్నాం
జీతాలు అందకపోయినా గానుగాట జరపాలని పని చేస్తున్నాం. ఓవర్‌హాలింగ్ పనుల్లో పస్తులు ఉండి కూడా పాల్గొంటున్నాం. కర్మాగారంలో గానుగాడితేనే మాకు కుటుంబపోషణ ఉంటుంది.
-పి.ఉమామహేశ్వరరావు, ఎన్‌ఎంఆర్