తుమ్మపాల సుగర్స్‌ను ఆధునీకరించాలి
సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ సభ్యులు, రైతులు ఆందోళన
అనకాపల్లిరూరల్ (మునగపాక) :తుమ్మపాల సుగర్‌ఫ్యాక్టరీని ఆధునీకరించాలని.. రైతులు, కార్మికులకు న్యాయం చేయాలని వీవీ రమణ కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆందోళన చేశారు. మంగళవారం రైతులు, కార్మికులతో కలసి సుగర్ ఫ్యాక్టరీ నుంచి నెహ్రూచౌక్ కూడలి వరకూ ర్యాలీ తీశారు. అక్కడ మానవహారం నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా వచ్చి రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలన్నారు. తర్వాత తహశీల్దార్ భాస్కరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనకారులనుద్దేశించి సుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ దంతులూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ రైతులు, కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా తాత్సారం చేయడం బాధాకరమన్నారు. రైతులకు బకాయి పడిన రూ.రెండు కోట్లను తక్షణమే చెల్లించాలన్నారు. రూ.8 కోట్ల మేర గ్రాడ్యుటీ కింద చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు.
పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ తుమ్మపాల సుగర్‌ఫ్యాక్టరీ సమస్య పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నాకు దిగుతానని చెప్పిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అందుకు కట్టుబడి ఉండాలన్నారు. వైఎస్సార్ సీపీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ రైతులు, కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపేదిలేదన్నారు. వ్యవసాయదారుల సంఘం నాయకులు పైడారావు మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఆధునీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడిమిశెట్టి రాంజీ, సీపీఐ నాయకులు వైఎన్ భద్రం, ఏఐటీయూసీ నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, ఆమ్‌ఆద్మీపార్టీ నా యకులు ఫణిరాజు, కొణతాల హరనాథబాబు, రిపబ్లికన్ ఫార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి అప్పారావు పాల్గొన్నారు.