సాక్షి, చిలమత్తూరు(అనంతపురం) : సీనియర్ విద్యార్థుల ముందే జూనియర్ విద్యార్థులు సిగరేట్ తాగడం వివాదానికి దారి తీసింది. మా ముందే సిగరేట్ తాగుతారా అంటూ జూనియర్ ఇంటర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థి పైశాచికంగా ప్రవర్తించాడు. కర్ర తీసుకుని విచక్షణారహితంగా బాదాడు. దీన్ని వీడియో తీసిన కొందరు విద్యార్థులు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే... చిలమత్తూరులోని డీవీఅండ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనరల్, ఒకేషనల్ గ్రూపుల్లో దాదాపు 350 మంది విద్యార్థులు చదువుతున్నారు.
స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని అధ్యాపకులు కళాశాలలో విద్యార్థులకు మూడు రోజులుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో సిరికల్చర్ గ్రూప్‌కు సంబంధించిన ఇద్దరు జూనియర్ విద్యార్థులు సిగరెట్ తాగుతున్నారని కళాశాల ఎదుట బైరేకుంట సమీపంలో సీనియర్ విద్యార్థి ఒకరు గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా కర్ర తీసుకుని ఒక జూనియర్ విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ దృశ్యాన్ని వీడియో కూడా తీశారు. మూడు రోజుల తర్వాత ఈ వీడియోను సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అప్‌లోడ్ చేశారు.
ఇది కాస్తా వైరల్ కావడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధిత విద్యార్థులు కోడూరు, వీరాపురం గ్రామాలకు చెందిన వారని, కర్రతో బాదిన విద్యార్థి లాలేపల్లికి చెందినవాడని గుర్తించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలిసిన వెంటనే సీనియర్ విద్యార్థి పరారయ్యాడు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. కర్రతో కొట్టిన విద్యార్థిని కళాశాల నుంచి బహిస్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment