రంగారెడ్డిజిల్లా, న్యూస్‌లైన్ : జిల్లా విద్యాశాఖ డొల్లతనం మరోసారి బయటపడింది. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించినప్పటికీ.. మళ్లీ తప్పులు పునరావృతం కావడం టీచర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ నెల 9న ఎల్‌ఎఫ్‌ఎల్, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల పదోన్నతుల కౌన్సెలింగ్ ఉంది. పదోన్నతులకు సంబంధించి జిల్లా విద్యాశాఖ ఇటీవల సీనియారిటీ జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో పదవీ విరమణ చేసిన, పదోన్నతులు పొందిన వారి పేర్లు కూడా ఉండడంతో ఉపాధ్యాయులు అయోమయం చెందుతున్నారు. ఇప్పటికే అభ్యంతరాలు తెలిపినప్పటికీ మళ్లీ తప్పులతడకగా జాబితా రూపొందించడం విద్యాశాఖాధికారుల పనితీరును స్పష్టం చేస్తోంది.
మరోవైపు ఉపాధ్యాయ ఖాళీల జాబితాలో కూడా ఇదే తరహాలో తప్పులున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సోషల్ సబ్జెక్టుకు సంబంధించి సరూర్‌నగర్ మండలంలో మూడు ఖాళీలు చూపిస్తున్నప్పటికీ.. అక్కడ ఖాళీలు లేవని, అదేవిధంగా బయోసైన్స్ కేటగిరీలోనూ ఘట్‌కేసర్ మండలంలో అదనంగా ఖాళీలు చూపిస్తున్నారని.. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా జాబితా రూపొందించారంటూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. హెచ్‌ఆర్‌ఏ స్థానాలు చూపడంతో పలువురు టీచర్లు ఆశతో కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉందని, వెంటనే తప్పులు సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.