- గవర్నర్ చేతికి హైదరాబాద్ శాంతిభద్రతలు
- రూల్స్ జారీకి కేంద్ర హోంశాఖ సుముఖత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య విభజన వివాదాల పరిష్కారం ఇక వేగవంతం కానుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎల్‌సీ గోయల్ నియామకం కావడంతో విభజన చట్టంలోని అంశాలను ఇక వేగంగా అమలుచేసే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ జె.వి.రాముడు భావిస్తున్నారు. బుధవారంనాటి ఢిల్లీ పర్యటనలో సీఎస్, డీజీపీలు ప్రత్యేకంగా హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమై విభజన అంశాలను వివరించారు.
ఈ క్రమంలో గోయల్ సానుకూలంగా స్పందించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలి వరకు హోం కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామి కాలయాపన చేశారని, ఇప్పుడా పరిస్థితి ఉండదని ఏపీ కూడా భావిస్తోంది. విభ జన చట్టంలోని సెక్షన్ 8(సి) మేరకు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పదేళ్లపాటు గవర్నర్ పర్యవేక్షించాలి. దీనికి కేంద్ర హోంశాఖ రూల్స్ జారీ చేయలేదు. దీనిపై స్పందించిన గోయల్.. సాధారణ రూల్స్ జారీ చేయవచ్చని అన్నట్టు తెలిసింది.
ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల మేరకు లేదా జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సంస్థల ఆస్తుల పంపిణీ విషయంలో చట్టంలో హెడ్ క్వార్టర్స్ అని ఉండడంతో టీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ సంస్థల్లోని ఆస్తుల పంపిణీకే అంగీకరిస్తామని, మిగతా సంస్థల పంపిణీకి అంగీకరించబోమని పేర్కొంది.
దీనిపై హెడ్ క్వార్ట ర్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సంస్థలే అంటే కుదరదని, ఆర్టీసీకి ఉమ్మడి రాజధానిలో బాడీ బిల్డింగ్ యూనిట్‌ను, ఆసుపత్రిని నిర్మించారు దానిలో కూడా వాటా కావాలని ఏపీ కోరుతోంది. దీనిపై కూడా కేంద్రం వివరణ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 10వ షెడ్యూల్‌లో 107 సంస్థలుండగా ఆ సంస్థలు పదేళ్ల పాటు ఉమ్మడి యాజమాన్యంలో పనిచేసేలా ఇరు రాష్ట్రాలూ అవగాన ఒప్పందాలు చేసుకునేలా హోంశాఖ చర్యలు చేపట్టనుంది.