
ఏం చెబితే అది జరగాలనుకోవడం తగదు
ఇరుప్రాంతాల నేతల ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని గుర్తించాలని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు.శుక్రవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఎదుట ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సాధించేదేమీ లేదని ఆయన ఈసందర్భంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే మేం ఏం చెబితే అది జరగాలనుకోవడం కూడా తగదని ఆ ప్రాంత నేతలకు సూచించారు.
హైదరాబాద్లో రేపు ఏపీఎన్జీవో సంఘం నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను అడ్డుకోవద్దని తెలంగాణ వాదులకు హితవు పలికారు.అటు సీమాంధ్ర,ఇటూ తెలంగాణ ప్రాంత ప్రజలతో చర్చిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఉండవల్లి అరుణ్కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో ఏన్నిక ప్రచారంలో భాగంగా యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్లో జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించిన కొన్ని అంశాలను ఉండవల్లి ఈ సందర్బంగా గుర్తు చేశారు.ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే దేశ సమగ్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉప్పెనలా ఎగసి పడుతున్న సమైక్య ఉద్యమంపై లోక్సభలో ప్రసంగిస్తున్న తనను తెలంగాణ ప్రాంత ఎంపీలు అడ్డుకోవడం సరైన చర్య కాదని ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు.