
సీరియల్ కిల్లర్ అరెస్టు
- భక్తి ముసుగులోమహిళలకు వల
- ఐదుగురిని హతమార్చిన కామాంధుడు
- మిస్సింగ్ కేసు విచారణలో పట్టుబడిన కేదారిలంక యువకుడు
రాజోలు: భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడటంతో పాటు హతమారుస్తున్న సీరియల్ కిల్లర్‌ను తూర్పు గోదావరి జిల్లా రాజోలు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామానికి చెందిన సలాది లక్ష్మీనారాయణ.. వేంకటేశ్వరుడు,, కనకదుర్గమ్మ కథలు చెబుతూంటాడు. మాయమాటలతో మహిళలను లోబర్చుకుని, జనసంచారం లేని ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన తర్వాత క్రూరంగా హత్య చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే రాజోలు పోలీస్ సర్కిల్ నగరం స్టేషన్ పరిధిలోని మామిడికుదురు గ్రామానికి చెందిన చేవూరి భాగ్యవతి ఈ నెల 8వ తేదీ నుంచి అదృశ్యమయ్యింది. పోలీసుల విచారణతో లక్ష్మీనారాయణ నారాయణ చేసిన వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో మామిడికుదురు వచ్చిన అతను వేంకటేశ్వరుని కథ చెప్పాడు. అప్పట్నుంచీ భాగ్యవతితో పరిచయం పెంచుకున్నాడు. గతంలోలాగే మాయమాటలతో నమ్మించి ఈ నెల 8న ఆమెను ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక, వెలాపులంక మధ్య జనసంచారం లేని ఇసుక దిబ్బల వద్దకు తీసుకువెళ్లి అతిక్రూరంగా లైంగికదాడికి పాల్పడ్డాడు.
అనంతరం జేబు రుమాలును గొంతుకు బిగించి హతమార్చాడు. ఆమె మెడలోని బంగారు నెక్లెస్‌తో పాటు చెవిదిద్దులు, కాళ్ల పట్టీలు, సెల్‌ఫోన్ అపహరించాడు. భాగ్యవతి అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అతని ఘాతుకాలు వెలుగుచూశాయి. 2012లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరిలంకకు చెందిన ఆకుల నాగమణిని, 2014లో యానాంకు చెందిన సత్యవతిని, అదే ఏడాదిలో దంగేరుకు చెందిన ఒక వివాహితను, 2015లో మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన బద్రి సత్యవతి అలియాస్ బుజ్జిని లక్ష్మీనారాయణ ఇదే తరహాలో హతమార్చాడు. వారి బంగారు ఆభరణాలను దొంగిలించి, మృతదేహాలను అక్కడే వదిలేసేవాడు. భాగ్యవతి మృతదేహాన్ని పిచ్చుకలంక ఇసుక దిబ్బల వద్ద గురువారం గుర్తించిన పోలీసులు లక్ష్మీనారాయణను అదేరోజు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.