‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు కుక్కర్ల కుంభకోణం ఐసీడీఎస్ శాఖ పరిధిలోని అధికారులకు చుట్టుకుంటోంది...
- కుక్కర్ల కుంభకోణంపై కలెక్టర్ సీరియస్
- సమగ్ర విచారణకు ఐసీడీఎస్ పీడీకి ఆదేశం
- కంపెనీ కుక్కర్లే సరఫరా చేశానంటున్న కాంట్రాక్టర్
- వాస్తవాలను తొక్కి పెట్టాల్సిందిగా సీడీపీఓలపై ఒత్తిడి
సాక్షి ప్రతినిధి, కడప : ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు కుక్కర్ల కుంభకోణం ఐసీడీఎస్ శాఖ పరిధిలోని అధికారులకు చుట్టుకుంటోంది. కార్యాలయ సిబ్బంది మొదలు సీడీపీఓల వరకు మొత్తం వ్యవహారం నడుస్తోంది. కుక్కర్లు సరఫరా కంటే ముందే బిల్లు చేజిక్కించుకుని, నిబంధనల మేరకు డెలివరీ చేసినట్లు రికార్డులు ఉండడంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని కాంట్రాక్టర్ చేతులు ఎత్తేశారు. వెరసి సానుకూల ధోరణితో కొందరు, కాసులకు కక్కుర్తి పడి మరికొందరు అడ్డంగా ఇరుక్కున్నారు. మొత్తం వ్యవహారంపై కలెక్టర్ కెవి రమణ సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఐసీడీఎస్ శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఐసీడిఎస్‌శాఖ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యతలేని లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేయడంపై బుధవారం ‘ప్రిస్టేజ్’ పోయింది శీర్షికన ప్రత్యేక కథనంతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కెవి రమణ సమగ్ర విచారణ చేపట్టాల్సిందిగా పీడీ రాఘవరావును ఆదేశించారు. ఆమేరకు ‘ఎంఅండ్‌ఎస్ ఎంటర్ ప్రైజెస్’ కంపెనీ వివరణ కోరారు. తాను నిబంధనల మేరకు కంపెనీ కుక్కర్లు సరఫరా చేశానని, ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని కాంట్రాక్టర్ రాత పూర్వకంగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. దాంతో ఐదు లీటర్ల కుక్కర్లు, 7.5 లీటర్లు కుక్కర్లు ఎన్ని సరఫరా చేశారు.. ఏ కంపెనీవి.. ఎప్పుడు ఇచ్చారు.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి.. అన్న విషయాలను ధ్రువీకరించాల్సిందిగా జిల్లాలోని సీడీపీఓలను పిడీ రాఘవరావు కోరినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వాస్తవాలను మరుగున పరచాలని, అన్ని కుక్కర్లు ప్రిస్టేజ్ కంపెనీవే అందాయని నివేదిక ఇవ్వాలని తెరవెనుక సీడీపీఓలపై ఒత్తిడి అధికమైనట్లు సమాచారం. ఇప్పటికీ వాస్తవ నివేదిక అందించకపోతే మొత్తం వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందనే భావనలో కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ‘మేము చూసుకుంటాం.. మీరు కాంట్రాక్టర్ చెప్పినట్లు నివేదిక ఇవ్వండ’ంటూ కార్యాలయ సిబ్బంది కొందరు రంగ ప్రవేశం చేసినట్లు సమాచారం.
ముందే బిల్లులు చెల్లింపులపై ఆరా
టెండర్లు ముగిసిన నెలలోపు కాంట్రాక్టర్ బిల్లు పెట్టుకోవడం, బిల్లు పెట్టిన రెండు రోజుల్లోనే మొత్తం రూ.74.69 లక్షలు చెల్లించడం, ఎనిమిది నెలల అనంతరం లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసిన వ్యవహారంలో కార్యాలయ సిబ్బంది పాత్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాంట్రాక్టర్, సిబ్బంది పరస్పర సహకారంతోనే ఇలా వ్యవహరించడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రిస్టేజ్ స్థానంలో నాణ్యతలేని కుక్కర్లు చేరాయి. సరఫరా చేయకపోయినా ఆగమేఘాలపై బిల్లు చెల్లించిన ఉదంతంలో కొంతమందికి లక్షలాది రూపాయాలు లంచంగా ముట్టినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఐదుగురు సీడీపీఓ ప్రాజెక్టుల పరిధిలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసినట్లు ఇప్పటికే రూఢీ అయినట్లు సమాచారం.
సమగ్ర విచారణ చేస్తున్నాం : రాఘవరావు, డీఆర్‌డీఏ పీడీ
అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రిస్టేజ్ ఫ్రెషర్ కుక్కర్ల స్థానంలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేయడంపై సమగ్ర విచారణ చేస్తున్నాం. కాంట్రాక్టర్ తాను ప్రిస్టేజ్ కంపెనీ కుక్కర్లు సరఫరా చేశానని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు, ఏ కంపెనీవి, ఎన్ని కుక్కర్లు ఇచ్చారు.. అవి ఏయే ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయన్న అంశంపై సీడీపీఓలను రాత పూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించాను. సమగ్రంగా విచారించి కలెక్టర్‌కు నివేదిక అందిస్తాం.