మూల్యాంకనంలో తప్పిదాలపై విద్యాశాఖ సీరియస్‌గా ఉంది. కొందరి నిర్లక్ష్యంతో ఏటా ఎందరో విద్యార్థులు ఫెయిల్‌కావడం, తక్కువ మార్కులు పొందడం వంటివి జరుగుతున్నాయి.
మూల్యాంకనంలో తప్పిదాలపై విద్యాశాఖ సీరియస్‌గా ఉంది. కొందరి నిర్లక్ష్యంతో ఏటా ఎందరో విద్యార్థులు ఫెయిల్‌కావడం, తక్కువ మార్కులు పొందడం వంటివి జరుగుతున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులు గురువులపై గురిపెట్టాయి. ఒకటి, రెండు తప్పిదాలకు నోటీసులు జారీ చేయడం, అంతకన్న ఎక్కువ ఉంటే జరిమానాతో పాటు శాశ్వతంగా మూల్యాంకనం నుంచి తప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. రెండేళ్ల నుంచి ఎస్‌ఎస్‌సీ బోర్డు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ బోర్డు అమలుపర్చనుంది.
జంకుతున్న గురువులు
స్పాట్‌వాల్యుయేషన్‌లో తక్కువ సమయంలో ఎక్కువ జవాబు పత్రాలు మూల్యాంకనం చే సి డబ్బులు దండుకోవాలనే వారికి ఇదీ చేదు వార్తే. విద్యార్థులు తమకెన్ని మార్కులు వచ్చాయో, చేసిన తప్పిదాలేంటో తెలుసుకోవడానికి ఆయా బోర్డులు జవాబు జిరాక్స్ పత్రాలు ఇస్తున్నాయి. ఇందులో తప్పుగా దిద్దినట్లు తేలితే విద్యార్థులు నేరుగా కోర్టుకు వెళ్లవచ్చు. పునఃపరిశీలనలో మార్కులు పెరుగుదలను బట్టి ఉపాధ్యాయులు, అధ్యాపకులపై చర్యలు ఉంటాయి. దీంతో మూల్యాంకనంలో పాల్గొనేందుకు గురువులు జంకుతున్నారు. 2012-13 మార్చి, ఏప్రిల్‌లో జరిగిన మూల్యంకనంలో జిల్లా వ్యాప్తంగా 102 మంది వరకు తప్పిదాలు చేశారు. ఇందులో ఏఈలు, సీఈలకు చిన్నతప్పిదాలకు పాల్పడ్డ వారికి తదుపరి మూల్యంకనానికి అనర్హులుగా ప్రకటించింది. ఐదు తప్పులు చేసిన ఏఈ, సీఈలకు రూ.500 నుంచి రూ.2 వేల వరకు జరిమానా విధింపుతోపాటు వారికి ఎస్సెస్సీ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
జరిమానా ఇలా..
పదో తరగతి మూల్యాంకనంలో తప్పిదాలకు పాల్పడే ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు, జరిమానా విధిస్తారు. ఒకటి నుంచి ఐదు తప్పిదాలు చేసిన ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు, ఆరు నుంచి 10 తప్పిదాలకు ఎగ్జామినర్లకు రూ.500, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.200, 11 నుంచి 20 తప్పిదాలకు ఎగ్జామినర్ రూ.వెయ్యి, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.500, 21 నుంచి 30 తప్పిదాలకు ఎగ్జామినర్లకు రూ.1,500, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.700, 30కి పైగా తప్పిదాలకు ఎగ్జామినర్లకు రూ.2 వేలు, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.వెయ్యి జరిమానా విధించడంతోపాటు మూల్యాంకనం విధులు అప్పగించరు. ఈ సంవత్సరం ఇదే పద్ధతి ఇంటర్‌లో అమలుకానుంది.