ఇక నుంచి ఐదేళ్ల లోపు పిల్లలు మరణిస్తే వైద్యుల విచారణ
డీఎంహెచ్‌వో ద్వారా కలెక్టర్‌కు నివేదిక
మరణాల నివారణకు కలెక్టర్ ప్రణాళిక
డయోరియా నుంచి కాపాడేందుకు టీకాలు
చిన్న పిల్లల మరణాలు పెరిగిపోవడంతో వాటిని నిలువరించేందుకు ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇక నుంచి జిల్లాలో ఎక్కడైనా ఐదేళ్ల లోపు చిన్నారులు మరణిస్తే దానిపై సమగ్ర విచారణ చేస్తారు. సంబంధింత పీహెచ్‌సీ వైద్యులు లేదా డిప్యూటీ డీఎంహెచ్‌వో స్థాయి అధికారి నేరుగా చిన్నారి ఇంటికి వెళ్లి కారణాలు తెలుసుకుంటారు. నివేదికను డీఎంహెచ్‌వో ద్వారా కలెక్టర్‌కు పంపిస్తారు.
కొయ్యూరు: ఇంతవరకు ఏడాదిలోపు బిడ్డ మరణిస్తేనే వైద్యాధికారులు విచారణ చేసి నివేదికను కలెక్టర్‌కు అందజేసేవారు. అయితే వివిధ కారణాలతో ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రతి చిన్నారి మరణంపై విచారణ చేయనున్నారు. ఈ నెల నుంచి సంభవించే ప్రతి మృతిపైనా విచారణ తప్పనిసరిగా ఉంటుంది. ఏఎన్‌ఎంల ద్వారా సమాచారం తెలుసుకున్న వైద్యులు నేరుగా బిడ్డ ఇంటికి వెళ్లి విచారిస్తారు. మరణానికి కారణాలు ఏమిటో తెలుసుకుంటారు. ఆ నివేదికను డీఎంహెచ్‌వోకు అందజేస్తారు. దానిని తరువాత కలెక్టర్‌కు పంపిస్తారు. మరణాల నివారణ చర్యలను కలెక్టర్ సూచిస్తారు. లేదా కొత్తగా ప్రణాళికను రూపకల్పన చేస్తారు. జిల్లాలో ప్రస్తుతానికి ప్రతి వెయ్యి మందిలో 38 వరకు శిశు మరణాలుంటున్నాయి. దానిని తగ్గించేందుకు చర్యలకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ప్రసవం అయిన తరువాత బిడ్డకు పాలు పట్టినప్పుడు భుజంపై వేసుకుని కొద్దిసేపు ఉంచాలి. అలా ఉంచకపోవడంతో తాగిన పాలు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళ్లి శ్వాస ఆడనీయకుండా చేస్తాయి. దీంతో బిడ్డ ఊపిరి ఆడక మరణిస్తున్న కేసులు మన్యంలో ఎక్కువగా ఉంటున్నాయి.
రోటా వైరస్‌కు టీకా మందు
చిన్నారుల ప్రాణాలు తోడేస్తున్న వ్యాధుల్లో డయేరియా ఒకటి. దీని ప్రభావాన్ని చాలా వరకు తగ్గించేందుకు వీలుగా రోటా వైరస్ నివారణకు ఈ నెల నుంచి టీకా మందును వేయేనున్నారు. దీని మూలంగా విరేచనాలతో మరణించేవారి సంఖ్య తగ్గుతుంది. బిడ్డకు ఆరు, పది,14 వారాల్లో చుక్కలు వేస్తారు. ఏటా దేశంలో డయేరియాతో లక్షా 20వేల మంది మరణిస్తున్నారని నర్సీపట్నం డిప్యూటీ డీఎంహెచ్‌వో సుజాత చెప్పారు. 4.5 లక్షల మంది విరేచనాలతో బాధపడుతున్నారన్నారు. దీనిని తగ్గించేందుకు వీలుగా టీకాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
బిడ్డ ప్రాణాలు కాపాడొచ్చు
రోటా వైరస్‌ను నిలువరించేందుకు ప్రస్తుతం అమలులోకి రాబోతున్న టీకాల మందు చిన్నారుల ప్రాణాలను రక్షిస్తుంది. దీని మూలంగా విరేచనాల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. బిడ్డ ప్రాణాలకు రక్షణ ఉంటుంది. ఈ నెల నుంచి దీనిని అమలు చేయనున్నారు
- ఎండీ అహ్మద్, చిన్న పిల్లల వైద్యనిపుణుడు, రాజేంద్రపాలెం
చిన్నారుల మరణాలపై సీరియస్
Published Mon, Mar 7 2016 3:40 AM | Last Updated on Thu, Aug 16 2018 4:21 PM
Advertisement