ఆయుర్వేద కౌన్సెలింగ్
మా బాబుకు ఆర్నెల్లు. గత రెండు నెలలుగా విరేచనాలు అవుతున్నాయి. పలచగా కొంచెం కొంచెం ప్రతి రెండు గంటలకీ ఒకసారి వెళ్తున్నాడు. మలం ఆకుపచ్చరంగులో ఉంటోంది. ఎన్ని మందులు వాడినా, తాత్కాలిక ఉపశమనమే. ఆయుర్వేదంలో పరిష్కారం సూచించగలరు.
- విశాల, నిజామాబాద్
శరీరంలోని ద్రవధాతువులు మలంతో ఎక్కువసార్లు గానీ లేదా అధిక ప్రమాణంలో గానీ బయటకు పోవడాన్ని ఆయుర్వేద పరిభాషలో ‘అతిసారం/అతీసారం’ అంటారు. దీనికి గల కారణాలలో పిల్లలకు, పెద్దలకు కొంచెం తేడా ఉంటుంది. కారణాలను బట్టి ఇతర అనుబంధ లక్షణాలలో కూడా మార్పు ఉంటుంది. ప్రధానంగా తల్లిపాలు తాగుతున్న శిశువులలో తల్లికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం, విరేచనాలు, దగ్గు వంటి లక్షణాలుంటే, అవి పాలు తాగే శిశువులకూ సంక్రమిస్తాయి. అలాగే తల్లి ఆహారంలో ఉప్పు, పులుపు, కారం, మసాలాలు ఎక్కువగా తినడం, మానసిక ఉద్వేగాలకు లోనై విచారం, ఆందోళన, దుఃఖం వంటి లక్షణాలతో బాధపడినప్పుడుగానీ, ఇతర జీర్ణకోశ వ్యాధులు సోకినప్పుడు గానీ, కొన్ని రకాల మందులు వాడినప్పుడుగానీ ఆ ప్రభావం శిశువు మీద పడి ‘అతిసారం’ రావచ్చు. తల్లికి సంబంధించిన కారణాలలో... శిశువునకు ఇచ్చే పాల స్వభావం, ఇతర ఆహారాలు, వాటి కల్తీలు, కొన్ని రకాల మందులు ప్రధానంగా ఉంటాయి.
మామూలుగా అయ్యే విరేచనాల సంఖ్య కంటే ఎంత పరిమాణం పోతోంది, ఎంత పల్చగా ఉంది, రంగు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి శిశువు శరీరం ‘నష్టద్రవానికి’ (డీహైడ్రేషన్‌కు) గురైందో తెలుస్తుంది. అదేవిధంగా వాంతులు, జ్వరం కూడా ఉంటే ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి. శిశువు పాలు తాగుతున్నా లేదా వయసుని బట్టి ఇచ్చే మెత్తని ద్రవఘనాహారం సక్రమంగా తీసుకుంటున్నా పరిస్థితి అంత తీవ్రంగా లేదన్నమాట. అతిసారంలో శిశువుకు ఆకలి కొంతవరకు మందగిస్తుంది.
చికిత్స: తల్లి ఆహారం సాత్వికంగా, బలకరంగా ఉండాలి. మసాలాలు, కారం తగ్గించాలి. అల్లం, వెల్లుల్లి మితంగా ప్రతినిత్యం సేవించాలి. తగినంత నిద్రపోతుండాలి. మానసికంగా ఉల్లాసంగా, సంతోషంగా ఉండాలి. శిశువునకు వాడే బట్టలు, ఇతర వస్త్రాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలి.
ఔషధాలు: 1. కర్పూర రస మాత్రలు : ఒకటి ఉదయం, ఒకటి రాత్రి తేనెతో... రెండు రోజులకంటే ఎక్కువ వాడవద్దు. 2. ప్రవాళపిష్ఠి, జహర్‌మొహర్‌పిష్ఠి (భస్మాలు): ఒక్కొక్కటి రెండేసి చిటికెలు (100 మి.గ్రా.) తేనెతో రెండుపూటలా. ఇది ఒక సంవత్సరం వయసు వరకు నిత్యం వాడుకోవచ్చు. దీనివల్ల శిశువుకు ఆకలిపెరగడం, ఎముకలకు, గుండెకు బలం కలుగుతుంది. నీరసం తగ్గుతుంది. మలం ఆకుపచ్చ రంగునుంచి ప్రాకృతవర్ణానికి మారుతుంది. గృహవైద్యం: ‘వాము’ని కషాయంగా కాచి పిల్లల్లో అయితే పావు చెంచా నుంచి అరచెంచా, పెద్దల్లో ఒకటి రెండు చెంచాలు తాగిస్తే అతిసారం వెంటనే తగ్గుతుంది. శరీరద్రవాంశాలు మెరుగుపడటానికి కొబ్బరినీళ్లు తాగించవచ్చు.
డాక్టర్ వృద్ధుల
లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్
వాస్క్యులర్ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. నేను ఒక పరిశ్రమలో పనిచేస్తున్నాను. మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు ఉన్న రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తున్నాయి. అవి ఎర్రటి, నీలం రంగులో ఉన్నాయి. వాటి వల్ల నాకు బాధ లేదు కానీ, ఎబ్బెట్టుగా, ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు.
- ప్రశాంత్, నెల్లూరు
మనిషి శరీరానికంతటికీ గుండె, రక్తనాళాల ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తుంది. మళ్లీ అవే రక్తనాళాల ద్వారా రక్తం గుండెకు చేరుతుంది. అయితే మిగతా భాగాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ కాళ్ల విషయానికి వస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల ఈ రక్తప్రసరణ ప్రక్రియ కాస్త ఆలస్యమవుతుంది. అంతేకాకుండా వయసు పైబడటం, కుటుంబ నేపథ్యం, స్థూలకాయం, కూర్చొని పనిచేయటం, అదేపనిగా నిలబడి పనిచేయడం, బరువైన వృత్తిపనులు చేయడంతో జరిగినప్పుడు రక్తప్రసరణ ఆలస్యం అవుతుంది. మహిళల్లో గర్భధారణ, హార్మోన్ల ప్రభావం వంటి అంశాలు రక్తప్రసరణ ఆలస్యమయ్యేలా చేయవచ్చు. శరీరంలో ఏ భాగానికైనా ఈ సమస్య ఏర్పడవచ్చు. కానీ సాధారణంగా మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు ఇది ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మీ కాలి దగ్గర ఒక ఎత్తయిన దిండు వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీ కాలి రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా లేదా రక్తనాళాలు ఉబ్బి గుండెకు చేరాల్సిన రక్తసరఫరాను అవి అడ్డుకుంటుంటే అప్పుడు మీరు ‘వేరికోస్ వెయిన్స్’ అనే కండిషన్ బారిన పడ్డట్లు చెప్పవచ్చు. మీరు మీ డాక్టర్‌ను సంప్రదిస్తే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తారు. ఒకవేళ మీరు ‘వేరికోస్ వెయిన్స్’ బారిన పడ్డా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ సమస్య మొదటి దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆధునిక వైద్య చికిత్స ద్వారా మీ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. సర్జరీ వంటి ప్రక్రియలకు ఖర్చు చేయడం అనవసరం అనే అభిప్రాయంతో మీ సమస్య తీవ్రతను పెంచుకోవద్దు. అలాగే నొప్పి, దురద, వాపులాంటివి లేవనుకొని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోండి.
డాక్టర్ దేవేందర్ సింగ్
సీనియర్ వాస్క్యులార్ సర్జన్
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా పాపకు 14 ఏళ్లు. ఏడాది కిందటినుంచి ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలి?
- రవళి, నిజామాబాద్
మీ పాపకు ఉన్న కండిషన్ నీవస్ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్ నీవస్ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్‌డ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివీ, చాలా సాధారణంగా కనిపించే మచ్చలు. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్ మచ్చ.
ఒంటిపై మచ్చలు పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఇది పుట్టుక నుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతో పాటు జన్యుపరమైన అబ్‌నార్మాలిటీస్ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. మీ పాపకు ఉన్న కండిషన్‌తో పైన చెప్పినవాటికి సంబంధం లేదు. మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ- అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ- అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ- అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ- అంటే డయామీటర్... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం) పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
రోహన్ హాస్పిటల్స్
విజయనగర్ కాలనీ
హైదరాబాద్
వేరికోస్ వెయిన్స్ చికిత్స విషయంలో నిర్లక్ష్యం వద్దు
Published Thu, Feb 18 2016 11:10 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM
Advertisement
Advertisement